నల్లగొండ, డిసెంబర్ 31 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి నల్లగొండ పట్టణాన్ని పూర్తిస్థాయిలో సుందరీకరించాలని, ఆ మార్పు ఈ ఆరు నెలల్లో స్పష్టంగా కనిపించాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శుక్రవారం ఆయన విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి మున్సిపాలిటీల అభివృద్ధిపై సమీక్షించారు. నల్లగొండ పట్టణంలో గుండగోని మైసయ్య కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పట్టణంలో రోడ్ల పరిస్థితి బాగాలేదని, ఉపాధి అవకాశాలు తీసుకురావడంతో పాటు పరిశ్రమలు పెంచాలని ప్రజలు తనను కోరినట్లు తెలిపారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ ఇప్పటికే సమీక్షించారని పేర్కొన్న మంత్రి.. రోడ్ల విషయంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. క్లాక్ టవర్ సెంటర్ వద్ద ఏడెకరాలు అందుబాటులో ఉన్నందున ఆడిటోరియం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, రైతు బజార్లు, అర్బన్ లంగ్ స్పేస్ కోసం స్థలాలు ఎంపిక చేయాలని ఆదేశించారు.
మున్సిపాలిటీలు ఆదాయం పెరిగే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఐదు నెలల్లో నల్లగొండ పట్టణ అభివృద్ధి స్పష్టంగా కనించాలని, మొదటగా ఆరు ముఖ్యమైన జంక్షన్లు, ఫుట్ పాత్‌లు, సర్వీస్ రోడ్లు నిర్మించాలని సూచించారు. ఉదయ సముద్రం సుందరీకరణ, అర్బన్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా నల్లగొండకు రూ. 100 కోట్లతో పనులకు సాంకేతిక మంజూరు పొందాలని సూచించారు. తాను ప్రతి రెండు నెలలకోసారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ నెలకోసారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చి పనులు పరిశీలిస్తారని తెలిపారు. నల్లగొండ చుట్టూ 50 ఎకరాల్లో నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి టౌన్షిప్ ఏర్పాటు చేయాలని, దాని ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని వెల్లడించారు. నల్లగొండ మున్సిపాలిటీ ఒక రోల్ మోడల్‌గా నిలవాలని, జిల్లాలోని మిగిలిన మున్సిపాలిటీలకు ఆదర్శంగా ఉండాలనేది సీఎం కోరిక అని తెలిపారు. రోడ్ల వెడల్పు సందర్భంగా వీధి వ్యాపారులను ఆదుకోవాలని, వారి కోసం వెండింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు.
నల్లగొండ అభివృద్ధిలో భాగంగా సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్, సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలిపారు. మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి పట్టణ ప్రగతి కింద రూ.72.72 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ టౌన్ హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు వెంటనే పంపాలని ఆర్అండ్బీ ఎస్ఈని ఆదేశించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్‌రావు, రమావత్ రవీంద్రకుమార్, నోముల భగత్, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ రెమా రాజేశ్వరి, మున్సిపల్ చైర్మన్లు, రెవెన్యూ, ట్రాన్స్‌కో, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు.