యాదాద్రి, మార్చి 5: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజైన శనివారం స్వామివారి బాలాలయంలో ధ్వజారోహణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గరుడ ఆళ్వారుడికి ఇష్టనైవేద్యం, ధ్వజ పూజలు చేశారు. రాత్రి 33 కోట్ల దేవతలను ఆహ్వానిస్తూ దేవతాహ్వానం, సకల దేవతలకు ఇష్టమైన భేరీపూజ, అగ్ని దేవుడికి ఆరాధన, హవనం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఆదివారం నుంచి స్వామివారి అలంకార సేవలు నిర్వహించనున్నారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమాన గోపురం స్వర్ణతాపడానికి హైదరాబాద్‌లోని బడంగ్‌పేట మున్సిపల్ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సామ నర్సింహగౌడ్-లక్ష్మి దంపతులు, వారి కుమారులు చంద్రశేఖర్‌గౌడ్, శ్రీకిషన్గౌడ్ రూ.2.50 లక్షలు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన మామిడి చంద్రశేఖర్‌రెడ్డి కూడా రూ.లక్ష విరాళం సమర్పించారు.