యాదాద్రి భువనగిరి : దేశంలోనే గొప్ప పర్యాటక ప్రాంతంగా యాదాద్రి దేవాలయం మారబోతున్నదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. గురువారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి సతీ సమేతం, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, సిద్దిపేట నియోజక వర్గ ప్రజా ప్రతినిధులతో కలిసి దర్శించుకున్నారు.
యాదాద్రి విమాన గోపురం స్వర్ణ తాపడానికి సిద్దిపేట నియోజకవర్గ తరపున కేజీ బంగారం ఆలయ ఈవో గీతకు అందజేశారు. అనంతరం స్వామీ వారి నూతనాయాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విమాన గోపురం స్వర్ణ తాపడనికి దాతల తరపున 35 కేజీల బంగారం సమకూరిందని తెలిపారు. మరో 45 కేజీల బంగారం అవసరం కాగా, దాతల సాకారంతో సంపూర్ణం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాబోవు రోజుల్లో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు గుట్టలో 100 పడకల దవాఖాన మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో యాదాద్రి ఆలయం మహాద్భుతంగా తీర్చిదిద్దారని తెలిపారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, టీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీఎంహెచ్ఓ సాంబశివరావు తదితరులు ఉన్నారు.