యాదాద్రి, అక్టోబర్30 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు శనివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు అర్చక బృందం సభ్యులు నిత్య పూజలు చేశారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీ నారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి హారతి నివేదన చేశారు. స్వామి వారిని సుదర్శన హోమంతో కొలిచి, సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలో ఊరేగించారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామి వారికి సహస్రనామార్చన, పుష్కరిణి వద్ద కొలువై ఉన్న క్షేత్ర పాలక ఆంజనేయ స్వామికి నిర్వహించిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొండ కింద పాత గోశాల వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతమాచరించి మొక్కులు తీర్చుకున్నారు. పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో నిత్యపూజ ల కోలాహలం నెలకొంది. శ్రీవారి ఖజానాకు శనివారం రూ. 9,57,193 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
యాదాద్రి చివరి దశ పనులు త్వరగా పూర్తిచేయాలి
యాదాద్రీశుడి ప్రధానాలయం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో చివరి దశ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆర్అండ్బీ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ రవీందర్రావు అధికారులను ఆదేశించారు. యాదాద్రిలోని స్వామి వారి వైకుంఠ ద్వారం వద్ద నిర్మిస్తున్న రోడ్డు, సర్కిల్, కొండపైకి వెళ్లేందుకు, దిగేందుకు నిర్మించే ఫ్లై ఓవర్ నిర్మాణాలు, రింగురోడ్డు సర్కిల్, సత్యనారాయణ వ్రత మండపం, కల్యాణ కట్ట, పుష్కరిణి, నిత్యాన్నదాన భవనం,క్యూ కాంప్లెక్స్, ఘాట్‌రోడ్డు, ఆర్చి పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఆయన వెంట వైటీడీఏ ఎస్ఈ వసంతనాయక్, ఈఈ వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ శంకరయ్య పాల్గొన్నారు.