
నల్లగొండ, నవంబర్ 11 : 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రైతులపై వివక్ష మొదలు పెట్టింది.గత ప్రభుత్వంలో రైతుల సంక్షేమంతో పాటు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాఖ ద్వారా అనేక పథకాలు ప్రవేశపెట్టి సబ్సిడీలు అందించింది. 2014లో ఎన్డీఏ ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆయా పార్టీల ఒత్తిడితో అప్పట్లో ఉన్న అన్ని పథకాలను కొనసాగించింది. 2019లో ఎన్డీఏలోనే ఉన్న బీజేపీ అధికారానికి కావాల్సిన సీట్లు సంపాదించిన నేపథ్యంలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే ప్రధానంగా రైతాంగంపై దృష్టి సారించి వ్యవసాయ శాఖలో అమలవుతున్న పథకాల్లో ఒక్కొక్కటిగా మూసివేసింది. దీంతో రెండేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్ప కేంద్రం నుండి రైతాంగానికి పెద్దగా సా యం జరగకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే దేశం ఒకే మార్కెట్ పేరుతో మార్కెట్ సెస్ లేకుండా పండించిన పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని… పంటకు మద్దతు ధర ఇవ్వక పోవడం మూలంగా రైతాంగం నేడు రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి నెలకొన్నది.
ఉరితాడులా వ్యవసాయ చట్టాలు
కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలు రైతాంగానికి నేడు ఉరితాడుగా మారాయి. ఒకే దేశం ఒకే మార్కెట్ పేరుతో ఎక్కడైనా ఏ ఉత్పత్తి అయినా విక్రయించుకోవచ్చని కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టం సన్న, చిన్న కారు రైతులకు శాపంగా మారింది. సన్నకారు రైతులు వేరే ప్రాంతాలకు వెళ్లి విక్రయించుకోలేక దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు. ప్రధానంగా వానాకాలం మినహా యాసంగి ధాన్యం కొనుగోలు చేయమని బీజీపీ పాలిత ప్రాంతాలకు లేని నిబంధనలు తెలంగాణలో పెట్టడం అనేది ఇక్కడ రైతాంగానికి తీరని ద్రోహం చేసినట్లు అవుతుంది. ఈ నేపద్యంలోనే నేడు టీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టింది.
మూసివేసిన పథకాల్లో కొన్ని.
ప్రధాన మంత్రి కృషి వికాస్ యోజన(పీఎంకేవీవై) ప్రతి ఏడాదీ కనీసం ఉమ్మడి జిల్లాలో బ10వేల మంది రైతులకు స్ప్రింకర్లు, తైవాన్ పంపులు, ట్రాక్టర్లతో పాటు ఇతర వ్యవసాయ పరికరాలు అందించే కేంద్రం రెండేండ్లుగా మూసివేసింది
జాతీయ ఆహార భద్రతా పథకం(ఎన్ఎఫ్ఎస్ఎమ్)కింద ప్రతి ఏటా ఆహార పంటలు పండించే రైతాంగానికి 33నుంచి 50శాతం వరకు సబ్సిడీ అందించి విత్తనాలు అందించగా నేడే ఆ పథకానికి ఫుల్ స్టాప్ పెట్టింది.
నూనె గింజెల ఉత్పత్తి పథకం(ఎన్ఎమ్ఓపీ) నూనె గింజలు అంటే వేరుశనగతో పాటు ఇతర ఆయిల్ ఉత్పత్తులు పండించే రైతులకు 50శాతం సబ్సిడీతో విత్తనాలు ఇచ్చే స్కీమ్ జాడే లేకుండా పోయింది.
వర్షాధార ప్రాంతాల అభివృద్ధి(ర్యాడ్) వర్షాలు పడే ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశం తో అక్కడ పడిన వాన నీరు నిల్వకు వాటర్ రీచార్జి పాయింట్లు, బోరు వేయటం, మోటార్లు ఇప్పించడం, పైప్లైన్ల అందజేత లాంటి కార్యక్రమాలు చేయగా నేడు అలాంటి పరిస్థితి లేదు.
పీఎంకేఎస్వైత(ప్రధాన మంత్రి కృషి సంచార్ యోజన) ఈ పథకం కింద ఆయా గ్రామాల్లో వ్యవసాయాభివృద్ధి కోసం నీటి కుంటల నిర్మాణంతో పాటు ఫాంపాండ్స్, పర్కులేషన్ ట్యాంక్స్ లాంటివి చేపట్టగా నేడు అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టారు.
అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్(ఆత్మ) ఈ పథకంతో వ్యవసాయ శాఖలో చేపట్టే పథకాలను రైతులకు వివరించడంతో పాటు ప్రతి పంటలోనూ దోమలు, పురుగులు, ఇతర క్రిమి కీటకాల వల్ల జరిగే నష్టాలు చెప్పాల్సి ఉంది. అయితే ఈ శాఖకు రెండేడ్లుగా నిధులు లేక యంత్రాంగానికి వేతనాలే ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.