వానకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జిల్లాలో మొదలైంది. కరోనా సంక్షోభంలో రైతులకు ఇబ్బందుల్లేకుండా ధాన్యం కొనుగోలు చేయగా ఈ సారి కూడా అదే తరహాలో జరిపేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా జిల్లా అవసరాల మేరకు 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 240 కొనుగోలు కేంద్రాలకుగానూ ఇప్పటివరకు 25 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభ మయ్యాయి. రైతులకు టోకెన్లు జారీ చేసి కేటాయించిన తేదీల్లో ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతున్నారు. ప్రతి గింజనూ కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది.
యాదాద్రి భువనగిరి, నవంబర్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానకాలం సీజన్లో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గోదావరి, మూసీ జలాలు సంవృద్ధిగా అందడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిసాయం, ఎరువులు, విత్తనాలు అందించడంతో రైతులు అత్యధికంగా వరిసాగు చేశారు. వానకాలం సీజన్లో రికార్డు స్థాయిలో 2.68 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దీంతో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. వరి కోతలు ప్రారంభం కాగా ధాన్యం కూడా దండిగా కొనుగోలు కేంద్రాలకు వస్తున్నది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
240 కేంద్రాలు
ఈ సీజన్లో రైతుల నుంచి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ శాఖ, ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం, ఐకేపీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 240 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి, రామన్నపేట మండలాల్లో 25 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం కూడా భువనగిరి, బీబీనగర్, వలిగొండ మండలాల్లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జిల్లాలో 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. అంతకు మించి వచ్చినా కొనేందుకు వీలుగా అధికారులు సిద్ధమయ్యారు. రైతులకు మద్దతు ధర అందే విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. గన్నీ బ్యాగులతో పాటు రవాణాలోనూ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
సమస్యలు తలెత్తకుండా చర్యలు
జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం. గన్నీ బ్యాగు లు, రవాణా వంటి విషయా ల్లో లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో ముందుకు సాగుతున్నాం. గత సీజన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సకాలంలో కొనుగోళ్లు పూర్తయ్యేలా దృష్టి సారిస్తున్నాం.
-గోపీకృష్ణ, సివిల్ సప్లయ్ డీఎం, యాదాద్రి భువనగిరి జిల్లా