యాదాద్రి, నవంబర్ 7 : కార్తీకమాసం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజలను భక్తులు ఆదివారం పెద్ద సంఖ్యలో నిర్వహించారు. కొండ కింద గోశాల వ్రత మండపం, పాతగుట్ట ఆలయం వద్ద వ్రత మండపాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే వ్రత మండపం వద్ద భక్తులు బారులు తీరారు. ఉదయం 5గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు నిరాటంకంగా వ్రతాలు కొనసాగాయి. 556 మంది దంపతులు వ్రత పూజల్లో పాల్గొన్నారు. వ్రత పూజలతో స్వామికి రూ.2,78,000 ఆదాయం సమకూరింది.
కిటకిటలాడిన యాదాద్రి క్షేత్రం
కార్తీకమాసంతో పాటు ఆదివారం సెలవు కావడంతో యాదాద్రి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనానికి క్యూ కట్టారు. శ్రీవారి ధర్మదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తలు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాల అనుమతిని నిరాకరించారు. స్వామి వారి పాదాల నుంచి పాతగోశాలకు వాహనాలు మళ్లించారు. సుమారు 25వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. తెల్లవారుజామున నిజాభిషేకంతో స్వామికి ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులను అభిషేకించి, సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదించి శ్రీసుదర్శన నారసింహ హోమంతో శ్రీవారిని కొలిచారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ నిత్యపూజలు నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా శ్రీవారి ఖజానాకు రూ. 27,78,451 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.స్వామిని మదర్ డెయిరీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
నేడు యాదాద్రికి మంత్రి మల్లారెడ్డి
యాదాద్రి ఆలయ విమాన గోపురానికి విరాళాలు సమర్పించేందుకు సోమవారం రాష్ట్ర కార్మిక మంత్రి సీహెచ్.మల్లారెడ్డి రానున్నారు. మొదటగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం ఈవో ఎన్.గీతకు విరాళాలు అందించనున్నారు.కార్తీకమాసం దీపారాధన కార్తీకమాసం సందర్భంగా స్వామి, అమ్మవార్లకు నిత్యపూజలతో పాటు సేవలు నిర్వహించారు. అర్చనలు, అష్టోత్తరాలు, సహస్రనామార్చనలు, సువర్ణ పుష్పార్చనలు చేసిన అనంతరం హోమం నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకుని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని, దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 5,29,486
వీఐపీ దర్శనాలు 4,65,000
నిత్యకైంకర్యాలు 600
వేద ఆశీర్వచనం 9,804
క్యారీబ్యాగుల విక్రయం 6,500
టెంకాయల విక్రయం 75,000
వ్రత పూజలు 2,78,000
కల్యాణకట్ట టిక్కెట్లు 46,600
ప్రసాద విక్రయం 8,05,390
శాశ్వత పూజలు 1,12,392
వాహన పూజలు 20,900
టోల్గేట్ 2,750
అన్నదాన విరాళం 22,464
సువర్ణ పుష్పార్చన 1,57,800
యాదరుషి నిలయం 85,000
పాతగుట్ట నుంచి 1,08,265
గోపూజ 1,450
ఇతర విభాగాలు 42,800