ప్రజారోగ్యానికి చేటు చేసే గుట్కా ప్యాకెట్లపై ప్రభుత్వం నిషేధం విధించినా, గుట్కా మాఫియా మాత్రం అడ్డదారుల్లో రెచ్చిపోతున్నది. సరిహద్దు రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటూ ఎక్కడికక్కడ రిటైల్ అడ్డాలకు చేరవేస్తున్నది. భువనగిరి గంజ్ కేంద్రంగా నిత్యం రూ.కోట్లల్లో ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తున్నది. దొంగ వే బిల్లులతో వాహనాల్లో పైన నిత్యావసర సరుకులు, అడుగు భాగంలో గుట్కా ప్యాకెట్లను పెట్టి
తరలిస్తున్నారు. అలా తెచ్చిన సరుకును పాత ఇండ్లు, పడావుబడ్డ గోడౌన్లలో డంప్ చేసి, దళారీకి
అప్పజెప్తున్నారు. అతడి నుంచి మండలాల వారీగా ఏజెంట్లు రిటైల్ షాపులకు చేరవేస్తున్నారు. తనిఖీల్లో పోలీసులకు చిక్కకుండా గుట్కా ప్యాకెట్లను తరలించే వాహనానికి ముందు మరొక ప్రైవేట్ ఎస్కార్ట్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ దందా పాలుపంచుకునే వ్యక్తుల సెల్‌ఫోన్ నంబర్లు, స్టాక్ పాయింట్లను ఎప్పటికప్పుడు మారుస్తుంటారు. ఉమ్మడిజిల్లాతోపాటు పొరుగున ఉన్న జనగామకూ సాగుతున్న రవాణాకు అమాయకులైన యువకులనూఉపయోగించుకుంటున్నారు. ఇదంతా పకడ్బందీగా సాగుతున్నా.. పోలీసులు పట్టుకుంటున్న ఉదంతాలు పెద్దగా ఉండకపోవడం విమర్శలకు తావిస్తున్నది. అడపాదడపా టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో వెలుగులోకి వస్తున్నా, అవి కూడా వాస్తవ పరిస్థితికి తగిన స్థాయిలో ఉండడం లేదని సమాచారం.
మోత్కూరు, నవంబర్ 6 : నోటి క్యాన్సర్‌కు కారణమవుతున్న గుట్కాలను ప్రభుత్వం నిషేధించింది. అయినా కొందరు అక్రమార్కులు వాటిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని గంజ్ కేంద్రంగా ఈ దందా సాగుతోంది. ఇక్కడి నుంచే ఉమ్మడి జిల్లాకు రోజూ కోట్ల రూపాయల గుట్కాలు రవాణా అవుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా రెండు జాతీయ రహదారులు వెళ్తుండడంతో ఇక్కడి ట్రేడర్లు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక నుంచి తెచ్చి డంప్ చేస్తున్నారు. వాహనాల్లో ఇతర సామగ్రి చేరవేస్తున్నట్లు వేబిల్లు చూపి అందులో గుట్కాను సరఫరా చేస్తున్నారు. గత ఏప్రిల్ 26న కర్ణాటకలోని బీదర్‌కు చెందిన ఒకరు, రాజస్థాన్‌కు చెందిన మరో ఇద్దరు ముఠాగా ఏర్పడి మేడిపల్లి, ఉప్పల్ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని జిల్లాకు పొగాకు ఉత్పత్తులను సరఫరా చేస్తుండగా.. భువనగిరి పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.20లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
చైన్ సిస్టమ్
గుట్కా మాఫియా ఒక చైన్ సిస్టమ్‌గా ఏర్పడి గుట్కా రవాణా చేస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మన రాష్ట్రంలోకి వచ్చే కార్లు, ఇతర వాహనాల అడుగు భాగంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు ఉంచుతారు. వాటిపైన నిత్యావసర సరుకులు, కూరగాయలు పెట్టి సరఫరా చేస్తున్నారు. ఈ రవాణా ఎక్కువగా రాత్రి వేళల్లోనే పూర్తి చేస్తారు. ఇలా వచ్చిన సరుకును ఓ చోట డంప్ చేస్తారు. అక్కడి నుంచి దళారులు కొనుగోలు చేసి మండలానికి ఒకరిద్దరు ఏజెంట్లను పెట్టుకొని వారి ద్వారా ఆటోల్లో రిటైల్ షాపులకు చేరవేస్తారు. గుట్కా తీసుకొస్తున్న వాహనం ముందు మరో వ్యక్తి బైక్‌పై వెళ్తూ పోలీసుల తనిఖీలపై వారికి సమాచారం ఇస్తుంటాడు. అలాగే సరఫరాకు ఉపయోగించే వాహనాల వ్యక్తుల సెల్ నంబర్లను తరుచూ మారుస్తుంటారు. పైస్థాయి వ్యక్తులే కింది స్థాయి కిరాణం షాపులు, పాన్ డబ్బాల యజమానులకు ఫోన్ చేసి సరుకు ఎంత కావాలో అడిగి మరీ సరఫరా చేస్తారు. దీంతో వారి సెల్ నంబర్ ఎవరికీ ఇవ్వకుండా జాగ్రత్త వహిస్తుంటారు. దీంతో పాటు ఏజెంట్లు స్టాక్ పాయింట్లను ఎప్పటికప్పుడు మారుస్తూ దందా కొనసాగిస్తున్నారు. కొంత మంది ఏజెంట్లు స్నేహం పేరుతో యువతను తమ వద్దకు పిలుచుకొని మద్యానికి బానిసలుగా మార్చాక వారిని దందాలో వాడుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుట్కా ఏజెంట్లపై నిఘా పెట్టి దాడులు చేస్తుండడంతో కేసులు నమోదువుతున్నాయి. అయితే పట్టుబడిన వారు మూడు, నాలుగు రోజుల తర్వాత యథావిధిగా గుట్కా వ్యాపారం కొనసాగిస్తున్నారని సమాచారం.
రూ.కోట్లలో వ్యాపారం
రూ.5, రూ.10కి విక్రయించే గుట్కాల వ్యాపారం చిల్లర దందాగా కనిపిస్తున్నా.. ఉమ్మడి జిల్లాలో నెలకు కోట్ల రూపాయల్లో వ్యాపారం జరుగుతోంది. ఈ మధ్య పోలీసులు దాడులు చేస్తున్న ప్రతిచోటా రూ.10 నుంచి రూ.15లక్షల సరుకు పట్టుబడుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గుట్కా నమిలే వారి అభిరుచి ఆధారంగా సుమారు 10 పేర్లతో వీటిని తయారు చేస్తున్నారు. వీటి ప్యాకెట్‌మీద ధర రూ.9, నుంచి రూ. 10 వరకు ఉంటున్నా దళారుల నుంచి కొనుగోలుదారుడి వద్దకు వచ్చే సరికి రూ.20కు చేరుతోంది. ప్రభుత్వం ఆయా ఉత్పత్తులను నిషేధించడంతో దళారులు, ఏజెంట్లు వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
నిరంతర నిఘా
ప్రభుత్వం నిషేధించిన పొగాకు ఉత్పత్తులపై నిరంతర నిఘా ఏర్పాటు చేశాం. గుట్కా నిల్వలపై ఎస్ఓటీ, సివిల్ పోలీసులతో విస్తృతంగా తనిఖీలు చేస్తు న్నాం. కార్డెన్ సెర్చ్‌లోనూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పొగాకు, గుట్కా నిల్వలపై పోలీసులకు సమాచారం అందించాలి.
-కె. నారాయణరెడ్డి, డీసీపీ, యాదాద్రి భువనగిరి జోన్
పాత ఇండ్లల్లో డంప్
భువనగిరి పట్టణం, పరిసరాల్లో ఉన్న పాత ఇండ్లు, గోడౌన్లను ఎంచుకొని గుట్కాలు డంప్ చేస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరితోపాటు సరిహద్దులో ఉన్న జనగామ, సూర్యాపేట జిల్లాలో ఎక్కువగా నిషేధిత గుట్కా వ్యాపారం సాగిస్తున్నారు. ఎన్ని సార్లు కేసులు నమోదు చేసినా.. గుట్కా నిల్వలు సీజ్ చేసినా వారు దందా మాత్రం మానడం లేదు. చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు, రామన్నపేట, బీబీనగర్, తుర్కపల్లి, రాజాపేట, వలిగొండ, తిరుమలగిరి, నకిరేకల్ మండలాల్లో ఎక్కువగా ఈ వ్యాపారం సాగుతున్నట్లు తెలిసింది.