చౌటుప్పల్ రూరల్, డిసెంబర్ 2 : మూగ జీవాలే అయినా తమ పాత్రలకు జీవం పోశాయి.. అఖండ సినిమాలో హీరోను వెన్నంటి ఉంటూ పలు సందర్భాల్లో వెండితెరపై కనిపించిన ఈ ఎద్దుల జత యజమాని చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామానికి చెందిన నూనె శ్రీనివాస్ యాదవ్. గో ఆధారిత వ్యవసాయంపై మక్కువతో రెండేండ్ల కిందట ఒంగోలు జాతి గిత్తలను కొనుగోలు చేసి కృష్ణార్జునులుగా నామకరణం చేశాడు. సహజసిద్ధంగా పెంచిన పచ్చి గడ్డి, ఉడికించిన జొన్నలు, ఉలువలే వాటికి ఆహారం.
సినిమా అవకాశం ఇలా…
హైదరాబాద్ సమీపంలో ఓ సినిమా చిత్రీకరణ జరుగుతున్న ప్రదేశంలో గిర్‌జాతి ఆవులు అమ్మకానికి ఉన్నట్లు ఓ పశువైద్యుడు చెప్పడంతో శ్రీనివాస్ యాదవ్ అక్కడికి వెళ్లాడు. అదే సమయంలో అక్కడే ఉన్న రెండు ఎద్దులను సైతం ఆసక్తిగా గమనించడంతో వాటి సంరక్షకులు ‘ఎందుకు అలా పరీక్షగా చూస్తున్నారు..?’ అని ప్రశ్నించారు. తన వద్ద కూడా మరో రెండు ఎద్దులు ఉన్నాయని చెప్తూ వాటి శిక్షణకు సంబంధించిన వీడియోను సెల్ఫోన్లో చూపించాడు. వారి వద్ద ఉన్న ఎద్దులకు సరైన శిక్షణ లేకపోవడంతో ఎద్దులను తీసుకురావాలని శ్రీనివాస్‌ను కోరారు. దాంతో అతడు మరో నలుగురి సహాయంతో ఎద్దులను షూటింగ్‌కు తీసుకువెళ్లాడు. సినిమాలో ఇంటి ఎదుట కట్టివేసిన సన్నివేశంలో పాటు రౌడీలను తరిమే సన్నివేశంలోనూ పాల్గొన్నాయి. తొలిరోజునే సినిమాను వీక్షించిన బాలకృష్ణ అభిమానులు ప్రత్యేకించి ఎద్దుల జత గురించి మాట్లాడుకోవడం గమనార్హం.
ప్రజల్లో చైతన్యం కల్పించేందుకే..
గో ఆధారిత సేద్యంపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఎద్దులను కొని బల ప్రదర్శన పోటీలకు సిద్ధం చేశాను. బరువైన బండరాయిని ఈడ్చుకుంటూ వేగంగా పరుగెత్తేలా శిక్షణ ఇచ్చాను. బల ప్రదర్శనకు కావాల్సిన అన్ని మెళకువలు నేర్పించాను. పరుగుపందేల్లో పాల్గొనేందుకు అవసరమైన ట్రైనింగ్ కూడా ఇచ్చాను కానీ, పోటీల్లో వాటితోపాటు ముందు వరుసలో పరిగెత్తేందుకు యువకులు ముందుకు రాకపోవడంతో పోటీలకు వెళ్లడం లేదు. ట్రైనింగ్ వీడియోలు చూసిన సినిమా వాళ్లు మా కృష్ణార్జులను అఖండ సినిమాకు తీసుకున్నారు. డబ్బుల కోసం నేను వాటిని ఇవ్వకున్నా.. రెండు రోజుల షూటింగ్ కోసం 15వేల రూపాయలు ఇచ్చారు. బాలకృష్ణ అభిమానులు ప్రత్యేకించి ఎద్దుల గురించి చెప్పుకోవడం చాలా సంత్పప్తి నిచ్చింది. మొదటి రోజు షూటింగ్లో బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ మా కృష్ణార్జునుల ప్రతిభను దగ్గరుండి పరిశీలించారు.
సేంద్రియ సేద్యంలో గుర్తింపు..
లక్కారం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ యాదవ్‌కు 1.27 గుంటల భూమి ఉంది. ఆరెకరంలో మైసూర్ మల్లిక రకం వరిని సాగు చేశాడు. మొదటగా 11ఇంచుల దూరంలో ఒక్కో కర్రను నాటాడు. గోమూత్ర కషాయం, గోపేడను ఎరువుగా వేశాడు. పంట ఏపుగా పెరిగి ఒక్కొక్క కర్ర 15నుంచి 20వరకు పిలకలు వేసింది. ధాన్యం గొలుసులు సైతం పెద్దగా వచ్చాయి. కేవలం రూ.5వేల పెట్టుబడి మాత్రమే పెట్టాడు. అతడిని అవహేళన రైతులే నేడు అద్భుత ఫలితాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. దాదాపు 16 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నదని శ్రీనివాస్ యాదవ్ తెలిపాడు. మరో 10గుంటల భూమిలో రసాయనాలు వాడకుండా కూరగాయాలు సాగు చేస్తున్నాడు. దీనికి తోడు 11 ఆవులను పెంచి పాలను విక్రయిస్తున్నాడు. వాటి కోసం మరో 10గుంటల్లో పశుగ్రాసం పెంచుతున్నాడు. పాల కొనుగోలు దారులు నేరుగా షెడ్డు దగ్గరికే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. పొలం చుట్టూ 70కిపైగా వివిధ రకాల పండ్ల మొక్కలను కూడా నాటాడు.
‘సేంద్రియ సాగుతో పొలానికి తెగుళ్లు కూడా రాలేదు. పంట దిగుబడి కూడా బాగున్నది. ఎలాంటి రసాయనాలు, మందులు వాడకపోవడంతో బియ్యం కోసం అడ్వాన్స్ ఇస్తున్నారు. పంట చేను మీద ఉండగానే క్వింటా బియ్యం రూ.7వేల చొప్పున కొనేందుకు డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు. కూరగాయలు కూడా అదే పరిస్థితి. ధాన్యం మార్కెట్‌కు తరలించి అమ్ముకునే అవసరం లేకుండా పోయింది.. సేంద్రియ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నది. రైతులు కొత్తగా ఆలోచించి మంచి లాభాలు సాధించాలి’ అని శ్రీనివాస్ యాదవ్ తన అనుభవాన్ని పంచుకున్నాడు.