యాదాద్రి, నవంబర్ 2 : వెయ్యేండ్లు గుర్తుండిపోయేలా నిర్మించిన యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణంలో యాదగిరిగుట్ట పట్టణ ప్రజల సహకారం ఎంతో గొప్పదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలో రోడ్డు విస్తరణలో ఇండ్లు, దుకాణాలు కోల్పోయిన బాధితులకు ఇచ్చిన హామీని అమలు చేస్తున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. స్వామివారి వైకుంఠద్వారం నుంచి పాతగుట్ట చౌరస్తా వరకు రోడ్డు విస్తరణలో ఇండ్లు, దుకాణాలు కోల్పోయిన 131 బాధితులకు శాశ్వత ఉపాధిని కల్పిస్తూ కొండ కింద ఆర్టీసీ బస్ టెర్మినల్ పక్కన నిర్మించనున్న దుకాణాల మంజూరు హామీ పత్రాలను మంగళవారం పట్టణంలోని లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్లో అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో 150 ఫీట్ల మేర రోడ్డు విస్తరణకు అధికారులు ప్రతిపాదనలు పంపారని, దుకాణాదారులు నష్టపోతారని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి విస్తరణను 120 ఫీట్లకు కుదించేలా కృషి చేశామని తెలిపారు. రాయగిరి నుంచి పాదాల వరకు రోడ్డు మధ్యలో డివైడర్ల విస్తీర్ణాన్ని కుదించి బాధితులకు నష్ట శాతం తగ్గించామన్నారు. ఈ సందర్భంలో ఎంతో మంది స్థానిక నాయకులు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని గుర్తు చేశారు. అయినా మొక్కవోని దీక్షతో బాధితులకు ఇండ్ల స్థలాలతోపాటు 100 గజాల విస్తీర్ణంలో ప్రభుత్వ ఖర్చులతో అద్భుతమైన దుకాణాలు నిర్మిస్తున్నామన్నారు. సకల వసతులతో దుకాణాలు నిర్మాణమవుతాయని తెలిపారు. ఆర్టీసీ బస్ టెర్మినల్, సత్యనారాయణ వ్రత మండపం, లక్ష్మీపుష్కరిణి, కల్యాణ కట్ట ప్రాంతంలోనే దుకాణాలు మంజూరు కావడం అదృష్టంగా భావించాలన్నారు. ఆలయ ప్రారంభం అనంతరం ఇక్కడి ప్రాంతంలో భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని, దీంతో దుకాణాదారులకు చక్కటి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. దుకాణాల నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానించామని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. యాదాద్రి అభివృద్ధితో పట్టణంలో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో గత కలెక్టర్ అనితారామచంద్రన్, ఆర్డీఓ, తాసీల్దార్ సహకారం మరిచిపోలేనిదని గుర్తు చేశారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తూనే దుకాణాలు కోల్పోయిన బాధితులకు అండగా నిలిచేందుకు తాము ముందు వరుసలో ఉంటామని హామీ ఇచ్చారు. ఆర్డీఓ భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, తాసీల్దార్ అశోక్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, కౌన్సిలర్ నాగరాజు, కో ఆప్షన్ సభ్యురాలు పద్మ పాల్గొన్నారు.