కవులు, కళాకారులు సమాజం సొత్తు అని, వారిని గౌరవించుకోవడం మనందరి కర్తవ్యమని పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు. సమైక్య సాహితీ ఆధ్వర్యంలో కరీంనగర్ ఫిలిం భవన్లో బుధవారం జరిగిన విశిష్ట పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విభిన్న రంగాల్లో ప్రసిద్ధులైన వారి తండ్రుల స్మారకంగా ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. తల్లిదండ్రుల పట్ల ప్రేమ రాహిత్యం పెరుగుతూ.. విలువలు తగ్గిపోతున్న తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి మంచి సందేశం ఇస్తాయని అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. మన సంస్కృతిని, వారసత్వాన్ని ముందు తరాలకు అందించటానికి అవి దోహదపడతాయన్నారు.
ఈ సందర్భంగా ఆచార్య రజనీశ్రీ స్మారక నాట్య పురస్కారాన్ని ప్రసిద్ధ నాట్య కళాకారుడు, అభినవ సత్యభామ కళాకృష్ణకు శ్యాం ప్రసాద్ లాల్ ప్రదానం చేశారు. డాక్టర్ నాగభూషణం స్మారక పురస్కారాన్ని చరిత్ర పరిశోధకులు సంకేపల్లి నాగేంద్ర శర్మకు డాక్టర్ రఘురామన్ అందించారు. ఆచార్య సంపత్ కుమారాచార్య సంగీత పురస్కారాన్ని సంగీత దర్శకుడు కేబీ శర్మకు కేఎస్ అనంతాచార్య ప్రదానం చేశారు. రావికంటి రామయ్య స్మారక సాహిత్య పురస్కారాన్ని పద్యగురువు, ప్రవాస భారతీయులు కొల్లారపు ప్రకాశరావు శర్మకు సీనియర్ పాత్రికేయుడు రావికంటి శ్రీనివాస్ ప్రదానం చేశారు. మాడిశెట్టి మల్లయ్య స్మారక ఉపాధ్యాయ పురస్కారాన్ని పోరెడ్డి రంగయ్యకు మాడిశెట్టి గోపాల్ ప్రదానం చేశారు. పితృ దేవతార్చనకు ఈ కార్యక్రమం నిదర్శనమని గండ్ర లక్ష్మణ్ రావు అన్నారు. సనాతనం అంటే పురాతనం కాదని, శాశ్వతమైనదని, ఎప్పటీకీ ఉండేదని వివరించారు.ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత నలిమెల భాస్కర్, ప్రముఖ కవులు గండ్ర లక్ష్మణ్ రావు, మలయశ్రీ, అన్నవరం దేవేందర్, గాజుల రవీందర్, కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర తదితరులు పాల్గొని ప్రసంగించారు.