చెన్నై: అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లు జైల్లో గడిపి ఈ మధ్యే బయటకు వచ్చిన శశికళ ఇక తాను రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించింది. అయితే తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం మాత్రం ఆమెను మళ్లీ పార్టీలోకి తీసుకునే అంశంపై మాట్లాడటం గమనార్హం. నిజానికి చిన్నమ్మ మళ్లీ అన్నా డీఎంకేలోకి వచ్చే అవకాశమే లేదని ముఖ్యమంత్రి పళనిస్వామి స్పష్టం చేసినా.. ఆమెను మళ్లీ తీసుకునే అంశాన్ని పరిశీలించే అవకాశం ఉన్నదని పన్నీరుసెల్వం అన్నారు.
షరుతులు వర్తిస్తాయ్
ఆమె నాలుగేళ్లు జైల్లో ఉన్నారు. అమ్మ (జయలలిత)తో 32 ఏళ్లు కలిసి ఉన్నారు. కేవలం ఆ మానవత్వంతో మాత్రమే ఆమెను మళ్లీ పార్టీలోకి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తాం. అయితే ఆమె ప్రస్తుతం పార్టీ నిర్మాణం ఎలా ఉందో అలాగే అంగీకరించాలని కూడా పన్నీరుసెల్వం స్పష్టం చేశారు. పార్టీ ఓ వ్యక్తి లేదా కుటుంబం కోసం నడవదని ఆయన అన్నారు. ఆమె పార్టీ అధ్యక్షురాలిగా ఉండటాన్ని నిరసిస్తూ నాలుగేళ్ల కిందట జయలలిత సమాధి దగ్గర ధర్నాకు దిగిన పన్నీరుసెల్వం.. ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకోవడం విశేషం. ఆమె మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా లేదా అన్నది ఆమెనే నిర్ణయం తీసుకోవాలని కూడా పన్నీరు స్పష్టం చేశారు.