ఢిల్లీ: దేశ రాజధాని వేదికగా జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత పారా అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 క్యాటగిరీలో డిఫెండింగ్ చాంపియన్ సుమిత్ అంటిల్ స్వర్ణంతో హ్యాట్రిక్ సాధించాడు. 27 ఏండ్ల సుమిత్.. 71.37 మీటర్ల రికార్డు త్రో తో తన రికార్డు (70.83 మీ.)ను తానే తిరగరాశాడు. 2023, 204 ఎడిషన్స్‌లోనూ సుమిత్ స్వర్ణాలు గెలిచాడు.
పురుషుల జావెలిన్ త్రో ఎఫ్44 ఈవెంట్లో మన పారా అథ్లెట్లు సందీప్ సంజయ్ సర్గర్, సందీప్ చౌదరి తొలి రెండు స్థానాల్లో నిలిచారు. సర్గర్.. 62.82 మీటర్ల త్రో విసిరి స్వర్ణం గెలువగా చౌదరి 62.67 మీటర్ల త్రో తో రజతం గెలిచాడు. బ్రెజిల్‌కు చెందిన ఎడెనిల్సన్ రాబర్టొ (62.36 మీ.) కాంస్ంయ నెగ్గాడు. పారా డిస్కస్ త్రోలో యోగేశ్ ఖతునియా మరోసారి రజతంతో మెరిశాడు. డిస్కస్ త్రో ఎఫ్56 ఈవెంట్లో అతడు.. 42.49 మీటర్ల త్రో తో రెండోస్థానంలో నిలిచి సిల్వర్ గెలిచాడు. క్లాడినీ బాటిస్ట (బ్రెజిల్)45.67 మీటర్ల త్రో తో స్వర్ణం నెగ్గాడు.