INDW vs SLW : సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు బోణీ కొట్టింది. దీప్తి శర్మ(53, 3-54) ఆల్‌రౌండ్ షోతో శ్రీలంకను దెబ్బకొట్టగా 59 పరుగుల తేడాతో టీమిండియా జయభేరి మోగించింది. అమన్‌జోత్ కౌర్ (57), దీప్తిలు అర్థ శతకాలతో భారీ స్కోర్ అందించగా.. బంతితో స్పిన్నర్లు లంకను పడగొట్టారు. స్నేహ్ రానా(2-32), తెలుగమ్మాయి శ్రీ చరణి(2-37)లు తిప్పేయగా లంక 211కే ఆలౌటయ్యింది. దాంతో.. తొలి ప్రపంచ కప్ వేటలో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన తొలి అడుగు ఘనంగా వేసింది.
పదమూడో సీజన్ వన్డే వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న భారత్ కో హస్ట్ శ్రీలంకను చిత్తు చేసింది. వన్డేల్లో తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ విజయం సాధించింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం జరిగిన 48 ఓవర్ల మ్యాచ్‌లో తొలుత అర్ధ శతకంతో జట్టును ఆదుకున్న దీప్తి శర్మ(53) బంతితో వికెట్ల వేటతో శ్రీలంకను కష్టాల్లోకి నెట్టింది. ఓపెనర్ చమరి ఆటపట్టు(43)ను ఔట్ చేసిన దీప్తి.. ఆతర్వాతి ఓవర్లలో డేంజరసర్ కవిష దిల్హరి(15), అనుష్క సంజీవని(6)లను పెవిలియన్ పంపింది. దీప్తి సంధించిన ఫుల్ డెలివరీని సంజీవని మిడాన్‌లో ఆడబోయి హర్మన్‌ప్రీత్ కౌర్‌కు దొరికిపోయింది. దాంతో.. 140 వద్ద లంక ఆరో వికెట్ కోల్పోయింది.
1️⃣ brings 2️⃣
Sneh Rana completes her bowling with 2 quick wickets for #TeamIndia
Updates ▶️ https://t.co/lcSNn79t77#WomenInBlue | #CWC25 | #INDvSL | @SnehRana15 pic.twitter.com/eWwHDhgh06
— BCCI Women (@BCCIWomen) September 30, 2025
ప్రధాన బ్యాటర్లు అందరూ పెవిలియన్ చేరడంతో మ్యాచ్ టీమిండియా వైపు తిరిగింది. సుగంధిని కుమారి(10), నిలాక్షి డిసిల్వా(35) కాసేపు ప్రతిఘటించారు. పెద్ద షాట్లు ఆడుతున్న డిసిల్వాను 35వ ఓవర్లో స్నేహ్ రానా బౌల్డ్ చేయడంతో లంక ఓటమి ఖరారైంది. కాసేపటికే సంజీవని సైతం రానా ఓవర్లో బౌల్డ్ అయింది. చివరి బ్యాటర్ ఇనొకా రణవీరను ప్రతీకా ఎల్బీగా ఔట్ చేయగా శ్రీలంక 211 పరుగులకే ఆలౌటయ్యింది.
వరల్డ్ కప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వరల్డ్ కప్ ఆరంభ పోరులో భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు తడబడ్డారు. అయినా సరే టీమిండియా ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించిందంటే అందుకు కారణం అమన్‌జోత్ కౌర్ (57), దీప్తి శర్మ(53)లు.
శ్రీలంక స్పిన్నర్ ఇనొకా రణవీర (4-46) విజృంభణతో 124కే ఆరు వికెట్లు పడిన దశలో ఈ ఇద్దరూ క్రీజులో పాతుకుపోయారు. ఆలౌట్ అంచున నిలిచిన టీమిండియా ఇన్నింగ్స్‌కు ఇరుసులా నిలిచారిద్దరూ. ఏడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి ఆదుకున్నారు. ఆఖరి బంతికి దీప్తి ఔట్ కాగా భారత్ 47 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.