అంచనాల్లేకుండా బరిలోకి దిగి అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టాడు. గాయాలతో సహవాసం చేస్తూ కెరీర్లో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొని గోడకు కొట్టిన బంతిలా రివ్వున పుంజుకున్నాడు. కెరీర్ ఇక ముగిసినట్లే అనుకున్న విమర్శకుల నోళ్లు మూయిస్తూ చరిత్ర సృష్టించాడు. అతనే తెలుగు యువ షట్లర్ కిడాంబి శ్రీకాంత్. స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన తొలి భారత షట్లర్ అరుదైన ఘనత సొంతం చేసుకున్న శ్రీకాంత్ ఇంకా అత్యుత్తమంగా రాణిస్తానని ఆత్మవిశ్వాసం కనబరిచాడు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రపంచ టోర్నీ ప్రదర్శనతో పాటు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోవడంతోనే అయిపోలేదని వచ్చే ఏడాది కీలక టోర్నీల్లో రాణించడమే లక్ష్యంగా దూసుకెళుతానని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ.
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన తొలి భారత షట్లర్‌గా నిలిచిన కిడాంబి శ్రీకాంత్ తన సత్తా ఏంటో చెప్పకనే చెప్పాడు. ఏమాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగి కెరీర్లో మొదటిసారి మెగాటోర్నీ ఫైనల్ చేరి వెండి పతకాన్ని ముద్దాడిన శ్రీకాంత్..మంగళవారం స్వదేశానికి చేరుకున్నాడు. గచ్చిబౌలిలోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.
ప్రపంచ టోర్నీలో పతక ప్రదర్శన ఎలా ఉంది?
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించడం చాలా సంతోషంగా ఉంది. గాయాలకు తోడు కరోనా వైరస్ విజృంభణ కారణంగా గత కొన్నేండ్లుగా స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చలేకపోయాను. కానీ ఎలాగైనా పుంజుకోవాలన్న పట్టుదలతో ప్రపంచ టోర్నీలో సత్తాచాటాను. మ్యాచ్ మ్యాచ్‌కు లక్ష్యాన్ని ఎంచుకుంటూ ముందుకు సాగాను. ఈ క్రమంలో ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురైనా తలవంచలేదు. పతకం సాధించాలనే అంతిమ ధ్యేయంతో ముందడుగు వేశాను. భారత్ తరఫున మెగాటోర్నీలో రజత పతకం సాధించిన తొలి షట్లర్‌గా నిలువడం మరిచిపోలేని అనుభూతి. కెరీర్లో చిరస్మరణీయ విజయాల్లో ఇది ఒకటని గర్వంగా చెప్పగలను.
తర్వాతి లక్ష్యమేంటి?
ప్రపంచ టోర్నీలో పతకంతో నా ప్రయాణంలో మరో మైలురాయి చేరింది. ఇది ఇక్కడితో ఆగదు. ఈ విజయాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలని ఉన్నా.. రానున్న టోర్నీలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన ప్రదర్శన కనబరుచాలనుకుంటున్నా. ముఖ్యంగా వచ్చే నెల 10 నుంచి మొదలయ్యే ఇండియన్ ఓపెన్‌తో పాటు ఆల్‌ఇంగ్లండ్ టోర్నీ, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడల్లాంటి మెగాటోర్నీల్లో రాణించాలన్న పట్టుదలతో ఉన్నాను. కెరీర్లో ఫిట్నెస్ పరంగా ప్రస్తుతం అత్యుత్తమ స్థాయిలో నాకు గాయాల సమస్య తీరింది. కోర్టులో చాలా మట్టుకు ఆత్మవిశ్వాసంతో ప్రత్యర్థులను ఎదుర్కొన్నాను. దీన్ని ఇంకా మెరుగుపర్చుకోవాల్సి ఉంది.
ప్రపంచ టోర్నీ విశేషాలు ఏంటీ?
స్పెయిన్ వేదికగా ప్రపంచ టోర్నీ అంచాలు లేకుండా బరిలోకి దిగడం ఒకరకంగా కలిసొచ్చింది. మ్యాచ్ మ్యాచ్‌కు విజయమే ధ్యేయంగా దూసుకెళ్లాను. ముఖ్యంగా యువ షట్లర్ లక్ష్యసేన్‌తో సెమీస్ పోరు ఆసక్తికరంగా సాగింది. లక్ష్యతో ఆడటం గత నాలుగైదేండ్లలో ఇది తొలిసారి. అప్పటికీ ఇప్పటికీ లక్ష్య ఆటతీరు చాలా మెరుగైంది. అతని కెరీర్‌ను గమనిస్తూ వస్తున్నాను. సెమీస్ మ్యాచ్‌లో లక్ష్య అద్భుతంగా ఆడాడు. కానీ ఎలాగైనా గెలువాలన్న లక్ష్యంతో ఆటడంతో మ్యాచ్ సుదీర్ఘంగా సాగింది. ఆట ఆసాంతం హోరాహోరీగా సాగడంతో బాగా అలసిపోయాను. నాదైన రోజున అత్యుత్తమంగా ఆడితే ఎంతటి ఆటగాన్ని అయినా ఓడిస్తానన్న నమ్మకం నాలో ఉంది.
టోక్యో ఒలింపిక్స్ అర్హతపై మీ స్పందన?
టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోవడం చాలా నిరాశ కల్గించింది. విశ్వక్రీడల ప్రారంభం నాటికి భారత్ తరఫున అత్యుత్తమ ర్యాంకింగ్స్‌లో ఉన్నా..బెర్తు దక్కించుకోలేకపోయాను. దీనికి పలు కారణాలు ఉన్నాయి. కరోనా వైరస్ విజృంభణ కారణంగా పలు టోర్నీలు అర్ధాంతరంగా రద్దుకావడంతో పాటు గాయాల సమస్య ప్రతిబంధకంగా మారింది. గాయాల నుంచి తేరుకుని పుంజుకుని టోర్నీల్లో రాణించేందుకు ప్రయత్నించినా..అప్పటికే కొవిడ్-19 కారణంగా టోర్నీలు రద్దవ్వడం టోక్యోకు దూరమయ్యేలా చేసింది.
అయినా ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోవడంతోనే ప్రపంచం ముగిసిపోయిందనుకోలేదు. నా అవకాశాలను నాకు ఉన్నాయనుకున్నాను. అందుకు అనుగుణంగా తీవ్రంగా శ్రమించాను. ప్రపంచ టోర్నీలో పతకంతో నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కడం సంతోషంగా ఉంది. రానున్న ఎనిమిది నుంచి పది నెలలు నాకు చాలా కీలకం కానుంది. గత కొన్ని నెలలుగా ఆటలో నేను ఎదుర్కొంటున్న సమస్యలపై గోపీఅన్నతో కలిసి చర్చిస్తాను. ఫైనల్ చేరుకున్నా..ఆటలో కొన్ని తప్పులు ఉన్నాయి..మరింత మెరుగ్గా ఆడేందుకు వాటిని సరిదిద్దుకోవాలి. లో కియాన్‌తో తుదిపోరులో ఆదిలో దూకుడు కనబరిచినా..కొన్ని అనవసర తప్పిదాల వల్ల మ్యాచ్‌ను చేజార్చుకోవాల్సి వచ్చింది. ఏ ఆటగాడికైనా ప్రపంచ టోర్నీలో పతకం ప్రత్యేకం.