కోదాడ, మార్చి 18 : ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రభుత్వానికి, ఉద్యోగ – ఉపాధ్యాయ- పెన్షనర్ల సంఘాలకు మధ్య వారధిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో గత మూడు రోజులుగా కొనసాగిన విశ్రాంత ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడా, సాహిత్య, సాంస్కృతిక పోటీలు మంగళవారం ముగిశాయి. విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్సీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుండి వయస్సుతో సంబంధం లేకుండా క్రీడలకు హాజరైన విశ్రాంత ఉద్యోగులు అభినందనీయులన్నారు.
ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగిన క్రీడలు, సాంస్కృతిక పోటీలు చారిత్రాత్మకంగా నిలుస్తాయన్నారు. పెండింగ్ డీఏలు పీఆర్సీ సర్వీస్ రూల్స్, ప్రధానంగా హెల్త్ కార్డులు సాధించే బాధ్యత తనదేనన్నారు. హక్కుల సాధన కోసం అవసరమైతే జరిగే ఉద్యమ కార్యాచరణకు ముందుంటానన్నారు. పాలకవర్గాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని చేస్తామంటాయని అధికారంలోకి రాగానే పరిస్థితులను బట్టి వ్యవహరిస్తుంటాయన్నారు. గతంలో పీఆర్టీయూ అధ్యక్షుడిగా ఉండి పెన్షనర్ల క్వాంటం పింఛన్ పై ముఖ్యమంత్రితో మాట్లాడి పింఛన్దారులకు లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. ఎంప్లాయిస్ జేఏసీ పక్షాన హక్కుల కోసం కృషి చేసినట్లు చెప్పారు.
ప్రస్తుతం తాను ఒక రిటైర్డ్ ఉద్యోగినేనని విశ్రాంత ఉద్యోగులకు అండగా ఉంటానన్నారు. రాష్ట్రస్థాయిలో విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య క్రీడలు నిర్వహించి కోదాడకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ లక్ష్మీనారాయణరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, కోదాడ యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్, రాష్ట్ర మహిళా ఉద్యోగుల చైర్మన్ ఉమా, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్ రెడ్డి, బొల్లు రాంబాబు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జితేందర్ రెడ్డి, తీగల నరేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ టి.వీరబాబు, భ్రమరాంబ, రఘు పాల్గొన్నారు.
MLC Sripal Reddy : వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి