మరిపెడ/స్టేషన్‌ఘన్‌పూర్, ఏప్రిల్ 11 : దంచికొడుతున్న ఎండలు ఉపాధి కూలీలకు చుక్కలు చూపిస్తున్నాయి. పని ప్రదేశంలో కూలీలకు కనీస వసతులు లేక ఇబ్బందిపడుతున్నారు. తాగేందుకు నీరు, నీడ కోసం టెంట్లు, ప్రథమ చికిత్స కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉండక అవస్థలు పడుతున్నారు. దీంతోపాటు ఉపాధి పనులకు వెళ్లిన కూలీలకు డబ్బులు ఎప్పుడు అందుతాయో తెలియక సతమతమవుతున్నారు. డబ్బుల విడుదల జాప్యంతో జాబ్‌కార్డులున్నా పనులకు వచ్చేందుకు కూలీలు సుముఖత చూపడం లేదు.
ఇక ఈ పథకంలో కేంద్రప్రభుత్వం చేస్తున్న మార్పులు కూలీలను ఇబ్బందిపెట్టేలా ఉన్నాయి. ఈ కేవైసీ చేసుకుంటేనే హాజరు నమోదవడం, ఫొటో క్యాప్చరింగ్ అటెండెన్స్ విధానంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. గ్రామాల్లో ఉపాధి కూలీలు ఉద యం 7 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి సు మారు మూడు నుంచి ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ పని ప్రదేశానికి వెళ్తారు. పనులు మొదలు పెట్టే ముందు గ్రూపులోని కూలీలకు ఫొటో క్యాప్చరింగ్ అటెండెన్స్ వేస్తారు.
ఇంతవరకు బాగానే ఉ న్నా, గ్రూపులో అప్పుడప్పుడు ఒక్కరు లేదా ఇద్దరి కనులు క్యాప్చర్ కాక వారు పని చేయకుండానే నిరాశతో తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఫొటో అటెండెన్స్‌తో పాటు బయోమెట్రిక్ విధానాన్ని కూడా అమలు చేయాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు. సర్వర్ సమస్యతో కూలీల ముఖగుర్తింపు నమోదు కాకపోవడంతో పని కోసం వచ్చిన కొందరు తిరిగి ఇండ్లకు వెళ్తున్నారు. హాజరు నమోదుకు ఫొటోలు తీసే సమయంలో సిగ్నల్ లేక సర్వర్ పనిచేయడం లేదని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతోపాటు మరిపెడ మండలంలోని కొన్ని గ్రామాల్లో చేపట్టిన పనుల కొలతల్లో తేడాల వల్ల, చెల్లించాల్సి న డబ్బుల్లో తేడాలు రావడంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో ఉదయం 7 నుంచి 11 గంటల వరకు మాత్రమే ఉపాధి పనులు చేస్తున్నారు. కూలీలకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తి విఫలమైంది. పని ప్రదేశంలో మజ్జిగ, నీళ్లు అందించేందుకు నిధులు లేవు, టెంట్లు కూడా వేయడం లేదు. ఇండ్ల నుంచే పని ప్రదేశాలకు తాగునీరు తెచ్చుకుంటున్నారు. కూలీలకు అందించే ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్ల పంపిణీపై అధికారులకు స్పష్టత లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఉండి పనులు చేయిస్తున్న ఫిల్డ్ అసిస్టెంట్లు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.