హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): దేశానికి స్వాతంత్య్రం వచ్చి సుమారు 75 ఏండ్లు అవుతున్నా ప్రతిరో జూ ఎక్కడో ఒకచోట మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. మహిళల రక్షణకు చట్టాలు ఉన్నా.. వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతోనే ఈ ఘటనలకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని నిమ్హాన్స్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన “కర్ణాటక మహిళా నారీ శక్తి రాష్ట్ర స్థాయి సమ్మేళనం” కార్యక్రమానికి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలపై వరకట్న వేధింపులు, అత్యాచారాలు వంటి కేసుల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు ఉండాలని, కానీ స్థానికసంస్థల్లో 33శాతం మాత్రమే రిజర్వేషన్లు దక్కుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి, విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప, ఎంపీ శ్రీనివాస్ పూజారి, కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.