ఝరాసంగం : మహిళల భద్రత (Womens Protection) , సంక్షేమం, చిన్నారుల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి( Lalitha Kumari ) తెలిపారు . గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కొనసాగుతున్న వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలకు వేధింపులు లేని వాతావరణం కల్పించేందుకు ‘పోష్’ (POSH) చట్టం రక్షణ కవచంలా నిలుస్తుందన్నారు. ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదు కమిటీ (ICC) ఏర్పాటు చేయడం తప్పనిసరని, బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు.
అంగన్వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, టీకాలు, ప్రీస్కూల్ విద్యను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులతో నిర్వహించిన సమావేశంలో గ్రామ స్థాయిలో మహిళా భద్రత, సంక్షేమ పథకాల అమలుపై దిశానిర్దేశం చేశారు. వార్డు సభ్యులు ప్రజలకు, యంత్రాంగానికి వారధిలా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మంజుల, జిల్లా సమన్వయకర్త పల్లవి, సూపర్వైజర్ రాధ, తదితరులు పాల్గొన్నారు.