Women’s Day | మహిళంటే ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. ఇవన్నీ పాత ముచ్చట్లు! నేటి మహిళ అంటే ఓ గేమ్‌చేంజర్. పాలసీ డిసైడర్. అమ్మగా లాలించడమూ తెలుసు.. అమ్మోరులా చెండాడటమూ తెలుసు! ఆమె సమర్థతకు అధికారం తోడైతే.. అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయని నిరూపిస్తున్న వారెందరో! అటువంటి మహిళామూర్తులకు ‘జిందగీ’ తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ప్రజారక్షణ విభాగంలో పనిచేసిన కొందరి విజయ వీరగాథలు మీకోసం..
‘పైకి కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా ఈ పోలీస్’.. అనే పురుషాధిక్య పోలీసింగ్‌లో తెగువ చూపుతున్న మగువలు ఎందరో ఉన్నారు. విధి నిర్వహణకు అంతఃకరణశుద్ధితో ప్రమాణం చేసినప్పటి నుంచి ఆడబిడ్డల రక్షణకు అహర్నిశలూ శ్రమిస్తున్నారు వీళ్లు. ఉన్న పదవికి, ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు వన్నె తెస్తున్నారు. ఆ కోవలో శిఖాగోయెల్, సౌమ్యమిశ్రా, స్వాతిలక్రా, సుమతి, చందన దీప్తి తదితరులు ముందువరుసలో నిలుస్తారు. శాంతిభద్రతలు, జైళ్లు, హోంగార్డ్స్ అండ్ ఆర్గనైజేషన్, ఇంటెలిజెన్స్, రైల్వే పోలీసు విభాగాల్లో కీలకంగా ఉన్న మహిళా అధికారులే వీరు. తమ విధి నిర్వహణలో మహిళల రక్షణ, అభ్యున్నతి కోసం ప్రతి దశలోనూ తమవంతు సహకారం చేస్తున్నవారే..
జైళ్లశాఖ తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా సమర్థంగా విధులు నిర్వర్తిస్తున్నారు సౌమ్య మిశ్రా. వరంగల్, కరీంనగర్, విజయనగరం వంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఆమె పేరు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందారు. జనజీవన స్రవంతిలో అన్నలను కలిపేందుకు తాను తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఆమెకు ఎనలేని కీర్తిని తీసుకొచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎంసెట్ లీకేజీలో నిందితులను అరెస్టు చేసినా, మానవ అక్రమ రవాణాను సమర్థంగా అడ్డుకున్నా.. స్పెషల్ డ్రైవ్‌లతో చిన్నారులను అక్రమ రవాణా నుంచి కాపాడినా.. ప్రతిదాంట్లో తనదైన ముద్ర కనబరిచారు. 1994 నుంచి నేటి వరకూ తాను పోలీసు శాఖకు అందించిన సేవలకు గుర్తింపుగా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు, మెడల్స్ అందుకున్నారు.
తన విశిష్ట సేవలకు గుర్తింపుగానే ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి విశిష్ట సేవ పతకానికి సౌమ్యమిశ్రా ఎంపికయ్యారు. తన మొదటి పోస్టింగ్‌లన్నీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలే అయినా విధుల్లో ఏనాడూ వెనకడుగు వేయలేదు. డ్యూటీలో కఠినంగా వ్యవహరించే సౌమ్యమిశ్రా.. ప్రేమను పంచడంలోనూ అదే విధంగా ఉండేవారు. తన హయాంలో మావోయిస్టుల లొంగుబాటుకు తీసుకున్న చర్యలు అద్భుత ఫలితాలను ఇచ్చాయి. ఎంతోమంది జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. వారికి రక్షణ, సదుపాయాలు కల్పించడంలో ఆమె ఎన్నడూ రాజీ పడలేదు. జీవ వైవిధ్యంపై యూఎన్ కన్వెక్షన్ కోసం 194 దేశాల ప్రతినిధులు హాజరవగా.. లా అండ్ ఆర్డర్ ఐజీగా ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా రక్షణ కల్పించారు. తన హయాంలో వచ్చిన మేడారం జాతరలో 90 లక్షల మంది భక్తులు హాజరైనా రక్షణ కల్పించడంలో ఎక్కడా రాజీ పడలేదు.
తెలంగాణ పోలీసుశాఖకు మణిహారంగా, మహిళ భద్రతలో ఎలాంటి రాజీలేని పోరాటం చేస్తున్న షీటీమ్స్ రూపకల్పన వెనక నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటే.. గత ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా షీటీమ్స్‌కు విస్తృత ప్రచారం కల్పించి.. పోకిరీల తాటతీసి, వారిలో భయాన్ని కల్పించడంలో స్వాతిలక్రా పాత్ర మరువలేనిది. క్షేత్రస్థాయికి షీటీమ్స్‌ను తీసుకెళ్లి, అన్ని వేదికల ద్వారా మహిళల భద్రతపై ప్రచారం కల్పించి, మహిళల్లో ధైర్యం నింపడంలో ఆమె నిరంతరం కృషి చేశారు. ప్రస్తుతం ఆర్గనైజేషన్స్ అండ్ హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా ఉన్న స్వాతి లక్రా.. 1995 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. మహిళల భద్రతకు అదనపు డీజీపీగా ఆమె పనిచేసిన కాలంలో, బహిరంగ ప్రదేశాల్లో, ఆన్లైన్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టడానికి పనిచేసే షీ బృందాలను పరుగులు పెట్టించారు. అప్పటి నుంచి బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు గణనీయంగా తగ్గాయి.
గత ప్రభుత్వానికి మంచిపేరూ వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని.. నాటి ప్రభుత్వ ఆలోచన మేరకు తీవ్రమైన లైంగిక నేరాలకు గురైన మహిళలు, పిల్లలకు సమగ్ర సహాయ కేంద్రంగా తీర్చిదిద్దారు. నాడు భారత సుప్రీంకోర్టు కూడా భరోసా కేంద్రం పనిని గుర్తించింది. హైదరాబాద్‌లోని భరోసా కేంద్రాన్ని దేశంలోని ఇతర వన్ స్టాప్ కేంద్రాలకు నమూనాగా ఉపయోగించవచ్చని పేరొంది. తన ఐపీఎస్ ప్రయాణంలో ఎన్నో మెడల్స్, పురస్కారాలను అందుకున్నారు. 2020లో మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడంలో ఆదర్శప్రాయమైన పోలీసింగ్ చొరవకు లీడర్షిప్ అవార్డు, 2021లో రాష్ట్రపతి పోలీస్ మెడల్, 2024లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి అతి ఉతృష్ట్ సేవా పతక్‌ను పొందారు.
దుష్ట శిక్షణ కోసం ఒక్కోసారి పోలీసులే దొంగల అవతారం ఎత్తాల్సి రావొచ్చు. అట్లాంటి ఆసక్తికరమైన విషయం తాను ఉమెన్‌సేఫ్టీ వింగ్‌లో పనిస్తున్నప్పుడు జరిగిందని ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగం ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న ‘లేడీ సింగం’ బి.సుమతి తెలిపారు. హ్యూమన్ ట్రాఫికింగ్, పోర్న్ వీడియోల అప్లోడింగ్, చైల్డ్‌పోర్న్ లాంటివి అప్పట్లో డార్క్‌వెబ్ ద్వారా జోరుగా సాగేవి. ఈ క్రమంలో తన టీమ్‌ను ట్రాఫికర్స్గా మార్చి డార్క్‌వెబ్‌కు పరిచయం చేశారు సుమతి. అలా ఎరను సిద్ధం చేసి.. అతిపెద్ద తిమింగలాలను పట్టుకునేవారు. ‘ఆపరేషన్ డార్క్‌వెబ్’ పేరుతో తెలంగాణ నుంచి ఎవడైతే పోర్న్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడో.. వాటి అడ్రస్‌లు తెలుసుకొని మరీ వెళ్లి అరెస్టు చేశారు. ఇలా ఓ ఐదారు నెలల కష్టం తర్వాత.. క్రమంగా డార్క్‌వెబ్ వేదికగా.. తెలంగాణ నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్, పోర్న్ వీడియోలు విక్రయించే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. అలా ఆడబిడ్డల సంరక్షణకు తాను రచించిన ఆ పథకం నేటికీ విజయవంతంగా కొనసాగుతుండటం, సత్ఫలితాలను ఇవ్వడం ఆనందాన్ని ఇస్తున్నదని సుమతి చెబుతున్నారు. ఇంటెలిజెన్స్ ఐజీగా తాను నిర్వర్తిస్తున్న పాత్ర చాలా గొప్పదని అంటారామె. మరోవైపు తల్లిగా తన ఇద్దరి బిడ్డలను ఉన్నత మార్గంవైపు తీర్చిదిద్దుతున్నారు.
ప్రపంచాన్ని ముందుకు నడిపించగల శక్తిసామర్థ్యాలు నేటి మహిళల్లో ఉన్నాయి. అట్లాంటి మహిళకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించడం మనందరి బాధ్యత. ఓ మహిళ ఇంట్లో ఉన్నా.. జిల్లా పరిధి దాటినా, దేశం దాటి విదేశాల్లో ఉన్నా కూడా తాను స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం ఉందో లేదో కూడా తెలుసుకోవాలి. మంచిచెడుల పరిస్థితులను అర్థం చేసుకునే సామర్థ్యం వారిలో ఉండాలి. ఆడబిడ్డలు ఉన్నతస్థానాలకు ఎదుగుతుంటే.. వారి లక్ష్యాలను తలిదండ్రులు అర్థం చేసుకోవాలి. అవసరమైన సహాయసహకారాలు అందించాలి.
డీజీ శిఖాగోయెల్.. తన పనితనమేంటో ఆమె దగ్గర ఉన్న డిపార్ట్మెంట్లను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నా.. మొదటి ప్రాధాన్యం మహిళల భద్రతే! మహిళ భద్రంగా ఉన్నచోట.. రక్షణ వ్యవస్థ పటిష్ఠంగా ఉన్నదని అర్థం. రక్షణ వ్యవస్థ పక్కాగా పనిచేస్తే.. పెట్టుబడులకు, ఆర్థికాభివృద్ధికి తిరుగే ఉండదు. అంతటి అంతర్గతమైన సూత్రాన్ని తన భుజస్కంధాలపై వేసుకొన్నారు శిఖాగోయెల్. తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు డీజీగా సేవలు అందిస్తూ ఎప్పటికప్పుడు సిబ్బందిని పరుగులు పెట్టించి మరీ.. ప్రజలకు కొండంత నమ్మకాన్ని ఇస్తున్నారు. ఒక్క ఉమెన్ సేఫ్టీ వింగ్లోనే షీటీమ్స్, భరోసా, గృహహింస నిరోధక వ్యవస్థ, యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్, ట్రాన్స్, ఎన్ఆర్ఐ, సాహస్, టీ-సేఫ్ వంటి పలు విభాగాలున్నాయి. ఇవన్నీ మహిళల రక్షణకు, మానవ అక్రమ రవాణా నియంత్రణకు అత్యంత కీలకం. అంతటి క్షిష్టమైన శాఖను సులువుగా నడిపిస్తూనే.. మరింత సంక్షిష్టమైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ను సైతం సునాయాసంగా నిర్వహిస్తున్నారు శిఖాగోయెల్.
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ)లోనే ఒకప్పుడు పలు విభాగాలుగా ఉన్న ఉమెన్ సేఫ్టీవింగ్, ఫోరెన్సిక్సైన్స్లు ఇప్పుడు ప్రత్యేక విభాగాలుగా మారిపోయాయి. వాటికి కూడా తనే డీజీ. అంతటి పదవిని సైతం సునాయాసంగా డీల్ చేయడంలో, ఆయా విభాగాల అధిపతులకు లక్ష్యాలను నిర్దేశించడంలో తన నేర్పరితనం, నాయకత్వం అనన్యసామాన్యం. ఇక అన్నింటికంటే ముఖ్యమైన విభాగం సైబర్ క్రైమ్స్. ఒక్క చుక్క రక్తం చిందకుండా.. లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అటువంటి ఆన్లైన్ దోపిడీ దొంగలకు మూకుతాడు వేస్తూ.. వందల కోట్ల ప్రజల సొమ్మును కాపాడి, ఆ డబ్బును బాధితులకు తిరిగి చెల్లించడంలో శిఖాగోయెల్ అండ్ టీమ్ క్రియాశీలంగా వ్యవహరిస్తున్నది. అన్నింటికీ మించి తను కూడా ఓ మాతృమూర్తి. కుటుంబ బాధ్యతతో పాటు.. వారి వ్యక్తిగత బాధ్యత, వృత్తిపరమైన బాగోగులు తనే దగ్గరుండి చూసుకుంటారు.
మహిళలు సమర్థులు. వారి భద్రత ఒక ప్రత్యేక హకు. మేము మీకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటాం. మీరు కూడా సృ్పహతో, ఐక్యంగా ఉండాలని కోరుతున్నాను. మొదట మీ హకులను తెలుసుకోండి. మిమ్మల్ని రక్షించే చట్టాలను అర్థం చేసుకోండి. సహాయం అడగడానికి ఎప్పుడూ వెనుకాడకండి. హింస, వివక్ష, వేధింపులు… సమస్య ఏదైనా సరే అవసరమైన సాయం తీసుకోండి. సైబర్ నేరాలపట్ల, ఆన్లైన్ వేదికగా జరిగే ఆకృత్యాలపట్ల అవగాహనతో ఉండండి. ఆపద ఎదురైతే ఏ క్షణమైనా డయల్ 100 మర్చిపోవద్దు.
దశాబ్దం క్రితం వరంగల్ జిల్లాలో జరిగిన ‘యాసిడ్ దాడి’ ఘటనను ఎవ్వరూ అంత సులువుగా మర్చిపోలేరు. సరిగ్గా ఆ ఘటనతో స్ఫూర్తిపొందిన వారిలో ఐపీఎస్ చందనా దీప్తి ఒకరు. ఐఐటీ సాధించాలనే తన ఆశయాన్ని వదులుకొని.. ఐపీఎస్ అవ్వాలనే పట్టుదలతో చదివారు. 2012లో ఐపీఎస్ సాధించిన ఈ తెలుగమ్మాయి.. విధి నిర్వహణ కొంచెం భిన్న శైలిలో ఉంటుంది. సర్వీసులో అడుగుపెట్టి పదేళ్లు కావొస్తున్నా అదే క్రమశిక్షణ, పట్టుదల, అంకిత భావంతో ప్రజలకు సేవ చేస్తున్నారు. మహిళలపై దాడులు తగ్గాలంటే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తీసుకునే చర్యలతో పాటు పురుషుల్లోనూ పరివర్తన రావాలనేది దీప్తి భావన. అందుకు తగ్గట్టుగానే ఐపీఎస్ అధికారిణిగా తన పరిధిలో మహిళల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. తాను పనిచేసిన ప్రతిచోటా ఈవ్ టీజింగ్‌ను అరికట్టేందుకు పోలీస్ స్టేషన్ల వారీగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అప్పుడు పోలీస్స్టేషన్లలో మహిళ కానిస్టేబుళ్లంటే అంతగా గౌరవం ఉండేది కాదు. అలాంటి చర్యలను ఓసారి కండ్లారా చూసిన దీప్తి చందనా.. ముందు తన ఇంటినే చక్కదిద్దుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. పోలీస్‌శాఖలో పనిచేసే మహిళా కానిస్టేబుళ్లను అధికారులు, ఇతర సిబ్బంది గౌరవించేలా ప్రణాళికలు రచించారు.
తన పనితనం గురించి తెలుసుకున్న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒక అమ్మాయి బాధ్యతను చందనకు అప్పగించారు. ఆ తర్వాత ఆమె బాధ్యతను తనే తీసుకున్న దీప్తి ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఓ జిల్లాకు పోలీస్ బాస్ అయినప్పటికీ.. గల్లీల్లో సైకిల్ వేసుకుని తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారంటే ఆమె ప్రజాపాలనకు ఎంత చేరువ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే వారిని ప్రేమగా పలకరించి వారి కష్టాలు తెలుసుకొని, ఆ సమస్యల పరిషారంలో అంతే శ్రద్ధ చూపారు. ‘మహిళలపై దాడులు అరికట్టాలంటే ముందు పురుషుల్లో మార్పు రావాలి. మహిళలు తమ ఆత్మరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా వేధిస్తున్నారంటే భయపడకుండా పోలీసులకు తెలియజేయాలి. ఇలాంటి అధికారులకు సమాజం కాస్త తోడుగా నిలబడితే చాలు..’ అని ప్రస్తుతం రైల్వేస్ ఎస్పీగా ఉన్న చందనా దీప్తి చెబుతున్నారు. నిరాడంబరంగా ఉండడం ఆమె ప్రత్యేకత.