Human Trafficking | కొమురంభీం జిల్లాలో పెళ్లి పేరుతో మహిళల విక్రయాలు జరుగుతున్నాయన్న ప్రచారం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. కొందరు దళారులు మహిళల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని, పెళ్లి పేరుతో వారిని పక్క రాష్ట్రాలకు విక్రయిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొమురంభీం జిల్లా బెజ్జూరు మండలం నుంచి ఉపాధి కోసం మంచిర్యాలకు వెళ్లిన ఇద్దరు పేద మహిళలను పరిచయం చేసుకుని, పెళ్లి చేస్తామని మహారాష్ట్ర, మంచిర్యాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు నమ్మించారు. మహిళల వద్ద ఉన్న ఫోన్లు తీసుకుని వారిని ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు తీసుకెళ్లారు. మహిళల నుంచి కొద్దిరోజులుగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో వారి కుటుంబసభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, వారిని ఇతర రాష్ట్రాల వ్యక్తులు పెళ్లి చేసుకుని, తమ సొంత గ్రామానికి తరలించినట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో మహిళల రవాణా కేసులో పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. గత ఏడాది జూన్ నెలలో ఆసిఫాబాద్ జిల్లాలో ఇదే తరహా ఘటన జరగడం గమనార్హం.