– శ్రీ సిటీ ఛైర్మన్ వెంకట్రావు
– మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ
ఖమ్మం రూరల్, జూలై 11 : మహిళలు ఆర్థికంగా ఎదగాలని, మహిళల ఆర్థిక ఎదుగుదల సమాజ ఎదుగుదలకు ఎంతో దోహద పడుతుందని శ్రీసిటీ ఛైర్మన్ గరికపాటి వెంకట్రావు అన్నారు. మాతృశ్రీ సంస్థ ఆధ్వర్యంలో శ్రీసిటీలో కుట్టు మిషన్ శిక్షణ పొందిన మహిళలకు శనివారం ఉచితంగా కుట్టు మిషన్లు అందజేశారు. గతంలోనూ కుట్లు, అల్లికలు నేర్చుకున్న మహిళలకు శ్రీసిటీ ఛైర్మన్ గా సొంత నిధులతో కుట్టు మిషన్లు అందజేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ.. మహిళలు కేవలం మిషన్ నేర్చుకోవడానికే పరిమితం కాకుండా ఇప్పుడు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని వ్యాపారపరమైన ఆలోచనలు చేయాలన్నారు. వివిధ సంస్థల నుంచి ఆర్డర్లు పొంది తద్వారా జీవనోపాధికి మార్గాన్ని ఏర్పరచుకోవాలని సూచించారు.
నేడు ఉన్న సమాజంలో మహిళలకు సైతం పలు అవకాశాలు వస్తున్నాయని వాటిని అందిపుచ్చుకున్న వారు ఆర్థికంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. శ్రీసిటీ అనేది రాష్ట్రంలోనే ఒక ల్యాండ్ మార్క్ కానుందని దానికి అందరూ సహకరించాలన్నారు. కేవలం నివాస పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా అన్ని వసతులు ఉన్నటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దనున్నామని వెంకట్రావు తెలిపారు. ఇప్పటికే విద్య పరంగా చేయూతనిచ్చామని రానున్న కాలంలో మరిన్ని కార్యక్రమాలతో శ్రీసిటీని -ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విజట్రెడ్డి, రమేష్, మాజీ సర్పంచ్ పాండు పాల్గొన్నారు.

‘మహిళలు ఆర్థికంగా ఎదగాలి’