వరంగల్: మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కోరారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్వతగిరి, వర్దన్నపేట మండలాలకు చెందిన మహిళలు ఉచిత బ్యూటిషియన్ శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా సర్టిఫికెట్లు అందజేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మహిళా ఆర్థిక స్వేచ్చ కలిగి ఉండాలని అందుకోసం మహిళలు స్వయం ఉపాధి మార్గాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత యువతులకు, మహిళలకు స్వయం ఉపాధిలో ప్రోత్సాహం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తక్కువ కాల వ్యవధిలో స్వయం ఉపాధి చేపట్టి ఆర్ధికంగా అభివృద్ధి చెందడానికి బ్యూటిషియన్ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
బ్యూటిషియన్ శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మరో నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ద్వారా వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోనే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగులు, క్రీడాకారులు, నిరుపేదలకు ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు.