ఇంద్రవెల్లి : స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bojju Patel) , జిల్లా కలెక్టర్ రాజర్షి షా ( Collector Rajarshi Sha) అన్నారు.
శుక్రవారం ఇంద్రవెల్లి మండలంలోని ఇందిరాయి మహిళా సమాఖ్య(ఐకెపీ) కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో గిరిజన మిల్లెట్ బిస్కెట్ యూనిట్ (Millet Biscuit Unit ) ను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఇందిరాయి మహిళ శక్తి క్యాంటిన్లు నెలకొల్పి ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తుందన్నారు.
గ్రూప్ సంఘాల మహిళలకు ప్రత్యేకంగా అద్దె బస్సులు నడపడానికి అందిస్తున్నామని వెల్లడించారు. మహిళలు తయారు చేస్తున్న బిస్కెట్లు, వంటకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. మహిళ సంఘాల మహిళలు తయారు చేసిన వస్తువులను అందరు కొనుగోలు చేయాలని కోరారు. అనంతరం మహిళలు తయారు చేసిన బిస్కెట్లను కొనుగోలు చేశారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ , డీఆర్డీవో పీడీ రాథోడ్ రవీందర్,రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరి బాయి, ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముకాడే ఉత్తమ్. ఏపీఎం రాథోడ్ రామారావు, కాంగ్రెస్ నాయకులు, స్వయ సహాయక మహిళ సంఘాలు, వీఏవోలు పాల్గొన్నారు.