హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉన్నత విద్యలో మహిళల హవా నడుస్తున్నది. డిగ్రీ, పీజీ కోర్సుల్లో వారిదే అధిపత్యం. ఏకంగా పురుషులను దాటి మహిళలు ముందంజలో నిలిచారు. పురుషుల ఎన్రోల్మెంట్ కంటే మహిళల నమోదు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో పురుషుల నమోదు నిష్పత్తి 44.2 శాతం ఉంటే, మహిళల నమోదు నిష్పత్తి 49.2 శాతంగా ఉన్నది. ఈ విషయాలను ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్(అయిషే) 2023-24 నివేదిక వెల్లడించింది. గత ఐదేండ్లలో రాష్ట్రంలో ఉన్నతవిద్య నమోదు నిష్పత్తి గణనీయంగా పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఇక గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో(స్థూల నమోదు నిష్పత్తి ) అత్యధికంగా ఉన్న రాష్ర్టాల్లోనూ తెలంగాణ చోటుదక్కించుకున్నది. ఈ విషయంలో తమిళనాడు మొదటిస్థానంలో నిలువగా, ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, ఉత్తరాఖండ్ ఉన్నాయి. 44.6శాతంతో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది.
