మేడమ్! నా వయసు 18 సంవత్సరాలు. ఇంటర్ చదివాను. ఆర్థిక సమస్యల వల్ల పైచదువులకు వెళ్లలేకపోయాను. నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే నాన్న చనిపోయాడు. అమ్మ ఒక హాస్పిటల్లో ఆయమ్మగా పని చేస్తోంది. అమ్మకు ఐదువేల జీతం వస్తుంది. నేను కూడా ఒక ప్రైమరీ స్కూల్లో పిల్లలకు చదువు చెబుతూ, అమ్మకు చేదోడుగా ఉంటున్నా. మేడమ్! నా సమస్య ఏమిటంటే.. నేనింకా రజస్వల కాలేదు. నాకు పుట్టుకతోనే గర్భసంచి లేదట. నాకు పెళ్లి కాదనీ, ఒకవేళ పెళ్లయినా పిల్లలు పుట్టరని అమ్మ అంటున్నది. ఇది నిజమేనా మేడమ్? నా జీవితం ఇంతేనా?
– ఓ సోదరి.
అమ్మా.. నిజంగా నీది చాలా బాధాకరమైన సమస్య. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో ఎమ్.ఆర్.కె.హెచ్. (మేయర్ రాకిటానిస్కి కస్టర్ హాసర్) సిండ్రోమ్ అంటారు. ఇది పుట్టుకతో వచ్చే శారీరక లోపం. ఈ సమస్యతో పుట్టినవారికి గర్భాశయం, యోని నాళం పైభాగం ఉండవు. లేదంటే పూర్తి స్థాయిలో వృద్ధి చెందవు. దాంతోపాటు కిడ్నీ, ఎముకల సమస్యలూ రావచ్చు. హెచ్ఓఎక్స్ వై జీన్స్.. శరీరంలో అవయవాల వృద్ధికి కారణమై, లైంగిక అంతర్గత అవయవాల నిర్మాణంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. పిండాభివృద్ధి దశల్లో లైంగిక అవయవాల నిర్మాణానికి ముల్లేరియన్ నాళాలు, హార్మోన్లు కారణం. మహిళల్లో అండవాహికలు, గర్భాశయం, సర్విక్స్, యోనినాళం పైభాగం ఏర్పడేందుకు ముల్లేరియన్ నాళాలే కారణం. అయితే, ఈ ముల్లేరియన్ నాళాల లోపాలు.. స్త్రీలలో పలు శారీరక వైకల్యాలకు (చిన్నవి – పెద్దవి) దారితీస్తాయి. కొన్ని సందర్భాల్లో చిన్నచిన్న లోపాలే కాదు.. మొత్తం అవయవమే లేకుండా ఉండొచ్చు కూడా. ఈ పరిస్థితి ఐదొందల మంది స్త్రీలలో ఒకరికి వస్తుంది.
ఇక నీ విషయానికి వస్తే.. నీకు యోని నాళం కింది భాగం ఉంది. దీనివల్ల, వైవాహిక జీవితానికి ఎలాంటి సమస్యా ఉండదు. కాకపోతే, గర్భాశయం లేదుకాబట్టి పిల్లలు పుట్టే అవకాశం లేదు. నీకు మంచి జీవితం ఉంది. నిన్ను, నీ సమస్యనూ అర్థం చేసుకొని ప్రేమించే మనిషిని నిరభ్యంతరంగా పెళ్లి చేసుకో. గర్భాశయం లేకపోతే జీవితమేమీ ముగిసిపోయినట్లు కాదు. కడుపున పుట్టినవారికంటే, అనాథలకు అమ్మ కావడం ఇంకా గొప్పవరం. దత్తత తీసుకోవడం ఉన్నతమైన, మానవీయమైన పని. నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. ఒకసారి అమ్మతో కౌన్సెలింగ్‌కు అటెండ్ అవ్వు. అంతా సర్దుకుంటుంది.
డా. భారతి (ఎమ్మెస్)
మారిటల్ కౌన్సిలర్, సైకోథెరపిస్ట్,జయా హాస్పిటల్
బీ.ఎన్. రెడ్డి నగర్ క్రాస్‌రోడ్, హైదరాబాద్
bharathid506@gmail.com, 7989227504