హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా మత్తుపదార్థాల వినియోగం చాపకిందనీరులా విస్తరిస్తుండగా, ఆ జాబితాలో మహిళలు, పిల్లలు కూడా భారీ సంఖ్యలో చేరుతున్నారని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఇటీవల వెల్లడించింది. రాజ్యసభలో ఎంపీ ఎంవీ శ్రేయమ్స్కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ వివరాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా మహిళలు, 10 నుంచి 17 ఏండ్లలోపు వారు వాడుతున్న మత్తుపదార్థాల్లో అత్యధికులు నొప్పినివారణ మందుబిళ్లలు, ఇంజెక్షన్లను తీసుకుంటున్నట్టు తెలిపింది. మహిళల్లో అత్యధికులు గంజాయి తీసుకుంటున్నట్టు నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపు 34,80,000 మంది మహిళలు గంజాయి వాడుతున్నట్టుగా తేలింది. నాడీ మండల వ్యవస్థపై పనిచేసే డ్రగ్స్(సెడెటివ్స్)ను వాడుతున్న వారిలో 20 లక్షల మంది 17 ఏండ్లలోపు పిల్లలు ఉండగా, మహిళల్లో 5.67లక్షల మంది ఉన్నట్టు అంచనా.
1,67,042 మందికి కౌన్సెలింగ్
నషాముక్త భారత్ అభియాన్(ఎన్ఎంబీఏ)లో భాగంగా దేశవ్యాప్తంగా డీ అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా గత రెండేండ్లలో 1,67,042 మందికి కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో మార్పు తెచ్చినట్టు నివేదిక పేర్కొంది. ఈ సెంటర్ల నిర్వహణకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నది. 2019 నుంచి ఈ నెలారంభం వరకు తెలంగాణకు రూ. 8.54 కోట్లు కేటాయించింది.