మార్కెట్ పల్స్
గత వారం కేవలం మూడు రోజులే ట్రేడింగ్ జరిగింది. దీంతో స్టాక్ మార్కెట్లు ఎలాంటి సంకేతాలను ఇవ్వలేకపోయాయి. ఈ మూడు రోజుల్లో ప్రధాన సూచీ నిఫ్టీ కదలికలు అంతకుముందు వారం రేంజ్‌లోనే ఉన్నాయి. పది వారాల సగటు వద్ద మద్దతు తీసుకున్న నిఫ్టీ.. డోజి లాంటి క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. దీనివల్ల ట్రెండ్ మీద ఎలాంటి ప్రభావం లేదు. ఈ వారానికి కూడా 17,784-18,450 సపోర్టు రెసిస్టెన్స్ స్థాయిలుగా పనిచేస్తాయి. 18,012 స్థాయిలోనూ సమీప రెసిస్టెన్స్ ఉన్నది. ఇక దీపావళి సందర్భంగా జరిగిన మూరత్ ట్రేడింగ్‌లో నిఫ్టీ లాభాలతో ముగిసినప్పటికీ.. ఆరంభ లాభాలను నిలబెట్టుకోలేకపోయింది. నిజానికి గత రెండు వారాలుగా ప్రతి చిన్న పెరుగుదలను కూడా లాభాల స్వీకరణకే మదుపరులు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే ఐదు డిస్ట్రిబ్యూషన్ రోజులను నమోదు చేసిన నిఫ్టీ.. మరో రోజు కూడా డౌన్ ట్రెండ్ నమోదు దిశగానే వెళ్లవచ్చు. నిఫ్టీ 18,450 స్థాయిని అధిగమించలేకపోతే 17,423 స్థాయిని తాకే అవకాశాలు లేకపోలేదు. ఈ వారానికి స్పష్టమైన సంకేతాలు వస్తేతప్ప సరైన ట్రేడింగ్ అవకాశాలు లభించవు.
బ్యాంకింగ్ షేర్లు ప్రోత్సాహకరంగా ఉన్నా యి. ఎస్బీఐ, కెనరా బ్యాంకుల ఫలితాలు మార్కెట్ అంచనాల కన్నా అధికంగా ఉన్నాయి. మెజారిటీ లార్జ్‌క్యాప్ షేర్లు టెక్నికల్‌గా బలహీనంగా కనిపిస్తుండటంతో నిఫ్టీ మద్దతు స్థాయిలను నిలుపుకోలేకపోతే మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. 17,900 స్థాయిని కోల్పోతే పాక్షిక లాభాలను స్వీకరించడం ఉత్తమం.