Donald Trump | న్యూఢిల్లీ, నవంబర్ 15: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం.. గోల్డ్ మార్కెట్ పతనానికి దారితీస్తున్నది. ఈ నెల 4న ట్రంప్ గెలిచినట్టు అధికారికంగా వెల్లడైన విషయం తెలిసిందే. అయితే అప్పట్నుంచి ఇప్పటిదాకా దేశీయ విపణిలో 10 గ్రాముల 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) బంగారం ధర రూ.5,350 (6.5 శాతం) పడిపోవడం గమనార్హం. డాలర్ ఇండెక్స్ (డీఎక్స్‌వై) అంతకంతకూ బలపడుతుండటం.. బులియన్ మార్కెట్‌ను బేరిష్ ట్రెండ్‌లోకి నెడుతున్నది. ప్రస్తుతం తులం రూ.77వేల దరిదాపుల్లో ఉన్నది. గత నెలాఖరున మునుపెన్నడూ లేనివిధంగా రూ.82,400 పలికిన సంగతి విదితమే. హైదరాబాద్‌లో తులం 22 క్యారెట్ రేటు రూ.70వేలకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరిదాకా డౌన్‌ట్రెండ్ కొనసాగవచ్చన్న అంచనాలే వినిపిస్తున్నాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక, పాలసీ నిర్ణయాలు వచ్చేదాకా గోల్డ్ రేట్ కరెక్షన్ ఉంటుందంటున్నారు.
ఎందుకింత ఒత్తిడి?
గత 10 రోజులుగా బంగారం ధరలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. బహిరంగ మార్కెట్‌తోపాటు కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లోనూ ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్ విధానాలను గమనిస్తే.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అనేక చర్యలు చేపట్టారు. అమెరికాకు చైనా నుంచి వచ్చే వస్తూత్పత్తులపై అధిక సుంకాలు విధించడం, వీసా విధానాన్ని కఠినతరం చేయడం వంటివి వీటిలో ఉన్నాయి. మళ్లీ జనవరి నుంచి ఆయనే అధ్యక్షుడిగా రానుండటంతో అమెరికా ఎకానమీపై ముఖ్యంగా ఆ దేశ కరెన్సీ డాలర్‌కు ఎక్కడలేని డిమాండ్‌ను తెచ్చిపెడుతున్నది. దీంతో పెట్టుబడులన్నీ స్టాక్స్, బాండ్ల మార్కెట్ వైపు వెళ్లిపోతున్నాయి. ఫలితంగా పసిడికి ఆదరణ తగ్గి ధరల క్షీణత చోటుచేసుకుంటున్నది.
ప్రభావితాంశాలివే..బిట్‌కాయిన్
బిట్కాయిన్పట్ల మదుపరులు చూపిస్తున్న అమితాసక్తి కూడా గోల్డ్ మార్కెట్ క్రాష్‌కు దారితీస్తున్నది. ఈ వర్చువల్ కరెన్సీకి అమెరికా మద్దతు ఉండబోతుందన్న అంచనాలే ఇందుకు కారణం. ఈ క్రమంలోనే తరలివస్తున్న పెట్టుబడులతో మళ్లీ ఆల్‌టైమ్ హైల్లో కి బిట్‌కాయిన్ విలువ వెళ్లింది. ప్రస్తుతం విలువ 89వేల డాలర్లపైనే పలుకుతున్నది.
ఈక్విటీ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లలో నష్టాలను, ఒడిదొడుకులను తట్టుకొనేందుకు ఇన్వెస్టర్లు ఎంచుకొనే సురక్షిత పెట్టుబడి మార్గమే బంగారం. అయితే ప్రస్తుతం మారిన ట్రెండ్‌తో ఇన్నాళ్లూ పెట్టిన పెట్టుబడులను గోల్డ్ మార్కెట్ నుంచి మదుపరులు వెనక్కి తీసుకుంటున్నారు. రిస్క్ ఎక్కువగా ఉన్నా ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమైపోతున్నారు. ఈటీఎఫ్‌ల నుంచి తరలిపోతున్న నిధులే ఇందుకు నిదర్శనం.
ఉద్రిక్తతలు తగ్గుతాయని..
యూరప్‌తోపాటు పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతాయన్న అంచనాలు కూడా పసిడి ధరల్ని కిందకు లాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైతే రాజకీయ, భౌగోళిక పరిస్థితుల్లో మార్పు ఉంటుందన్న విశ్వాసం మెజారిటీ మదుపరుల్లో కనిపిస్తున్నది.
డాలర్ ఇండెక్స్
ట్రంప్ గెలుపుతో ప్రపంచ కరెన్సీగా పేరున్న అమెరికా డాలర్లకు భారీగా డిమాండ్ వచ్చిపడింది. ఈ క్రమంలోనే డాలర్ ఇండెక్స్ పరుగులు పెడుతున్నది. దేశీయ మార్కెట్ నుంచి గతకొద్ది రోజులుగా తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు సైతం అమెరికన్ మార్కెట్లలోకే చేరుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధరలు నేలచూపుల్నే చూస్తున్నాయి. ఔన్సు గోల్డ్ విలువ రికార్డు స్థాయిల నుంచి దిగజారింది. కొమెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో 2,557.40 డాలర్లు పలికింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గిస్తుండటం కూడా పుత్తడి మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నది.