న్యూఢిల్లీ: చదరంగంలో చకచకా దూసుకెళ్తున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి ఖాతాలో మరో టైటిల్ చేరింది. ఇటీవలే జాతీయ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన ఈ తెలంగాణ కుర్రాడు.. మంగళవారం ముగిసిన ఢిల్లీ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నీలో చాంపియన్‌గా అవతరించాడు. పది రౌండ్ల పాటు జరిగిన టోర్నీలో మరో తెలంగాణ ప్లేయర్ హర్ష భరత్ కోటి, గుకేశ్‌తో కలిసి అర్జున్ 8.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఆఖరి రౌండ్లో అర్జున్.. కార్తీక్ వెంకట్రామన్‌ను చిత్తు చేశాడు. పాయింట్లు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు టై బ్రేకర్ నిర్వహించగా.. అందులో అర్జున్ సత్తాచాటాడు. టైటిల్‌తో పాటు రూ. 4 లక్షల నగదు బహుమతి సొంతం చేసుకున్న అర్జున్.. చెన్నై వేదికగా జరుగనున్న చెస్ ఒలింపియాడ్‌కు భారత జట్టులో చోటు దక్కించుకోవడం దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం అర్జున్ 2675 ఎలో రేటింగ్‌తో కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో గుకేశ్, హర్ష వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకోగా.. నిగ్మాటోవ్ ఓర్టిక్ (8 పాయింట్లు) నాలుగో ప్లేస్‌లో నిలిచాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రెండేండ్లుగా ఏ ప్రధాన చెస్ టోర్నీకీ ఆతిథ్యమివ్వని భారత్.. వచ్చే నెలలో అహ్మదాబాద్ వేదికగా మరో అంతర్జాతీయ టోర్నీ నిర్వహించనుంది.