వెల్దండ : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలోని కుందార తండాలో గాలి, వాన (Wind and Rain) బీభత్సం సృష్టించింది. కరెంటు స్తంభాలు ( Electricity Poles ) , భారీ వృక్షాలు ( Trees ) నేలకొరిగాయి. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. పలుచోట్ల కరెంటు స్తంభాలు విరిగి నివాసపు ఇండ్లపై పడ్డాయి. ఆ సమయంలో ఇళ్లల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గ్రామంలోని ఇళ్ల మధ్యలో చెట్లు సైతం విరిగిపడ్డాయి.
గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సమస్యను త్వరగా పరిష్కరించాలని, విద్యుత్ సరఫరా తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని గ్రామస్తులు అధికారులను కోరారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో కుందారం తండావాసులు ఊపిరి పిలుచుకున్నారు. బండోని పల్లి గ్రామంలో పిడుగు పడడంతో ఒకరికి గాయాలైనట్లు గ్రామస్థులు తెలిపారు. చొక్కన్నపళ్లి, బొల్లంపల్లి, చల్లపల్లి, అంకమోని కుంట గ్రామాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది. తోటల్లో మామిడికాయలు నేలరాలాయి. దీంతో మామిడి రైతులకు భారీ నష్టం కలిగింది.