Kejriwal : ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఆదివారం సాయంత్రం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో స్వదేశీ వస్తువులనే వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిపై ఆమ్ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వదేశీ వస్తువులను వినియోగించాలని ప్రజలకు పిలుపు ఇవ్వడానికి ముందు మీరు దాన్ని ఆచరించి చూపాలని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మీరు వాడుతున్న విదేశీ వస్తువులను బహిష్కరిస్తారా..? అని ప్రశ్నించారు.
ఈ మేరకు ఆయన తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. ‘ప్రధాని గారూ, ప్రజలు స్వదేశీ వస్తువులను వినియోగించాలని మీరు కోరుతున్నారు. మీరు మీకుగా స్వదేశీ వస్తువులను వినియోగించడం మొదలుపెడుతారా..? మీరు రోజూ తిరుగుతున్న విదేశీ విమానాన్ని వదిలేస్తారా..? రోజంతా మీరు వినియోగిస్తున్న విదేశీ వస్తువులను విడిచిపెడుతారా..?’ అని ప్రశ్నించారు.
అంతేగాక.. ‘దేశంలో ఉన్న నాలుగు అమెరికా కంపెనీలను మీరు మూసేస్తారా..? డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను, భారత ప్రజలను రోజూ అవమానిస్తున్నారు. మీరు ఏమీ చేయలేరా..? ప్రజలు వారి ప్రధాన మంత్రి నుంచి చర్యలు కోరుకుంటున్నారు. ఉపదేశాలు కాదు’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ప్రధాని స్వదేశీ వ్యాఖ్యలపై విమర్శలు చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ ఇటలీ అద్దాలు, స్విట్జర్లాండ్ గడియారం, అమెరికా ఫోన్, జర్మనీ కార్లు, విదేశీ బ్రాండ్లకు చెందిన దుస్తులు, ఇతర వస్తువులను వాడుతున్నారని.. కానీ ప్రజలకు మాత్రం ఇప్పటికీ ఆయన స్వదేశీ వస్తువులనే వాడాలని చెబుతున్నారని సంజయ్ సింగ్ విమర్శించారు.