నర్సాపూర్, జనవరి 12: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం కలగానే మిగిలిపోనున్నాదా… పట్టణ, గ్రామీణ వాసుల ఇక్కట్లు తీరడానికి పరిష్కారమే లేదా… మధ్యలోనే నిలిపివేసిన భవనాన్ని చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం నర్సాపూర్ మున్సిపల్ వాసులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో నర్సాపూర్‌లోని పాత తహసీల్ కార్యాలయ స్థలంలో 1.20 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టుంది. దీనికి రూ. 2 కోట్లు మంజూరు చేసింది. జీ ప్లస్ వన్‌కు అదనంగా రూ. 4 కోట్లు అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
ఎకరాన్నర విస్తీర్ణంలో 62 స్టాళ్లతో నిర్మాణ పనులు చేపట్టాలని ప్రణాళికతో పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. స్లాబ్ దశలోనే పనులు ఆగిపోయి పట్టణవాసుల ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి. నర్సాపూర్ పట్టణంలో కూరగాయలు, ఇతర సామగ్రి కొనడానికి పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎక్కువగా వస్తుంటారు. శుక్రవారం సంత కావడంతో ఇసుక వేస్తే రాలనంత జనంతో పట్టణం కిక్కిరిసిపోతున్నది.
కూరగాయలు, చికెన్, మటన్, చేపలు కొనుక్కోవడానికి ఇటు ప్రజలు, అటు అమ్ముకోడానికి వ్యాపారులు నానా ఇక్కట్లు పడుతున్నారని, ఈ సమస్యలు పరిష్కరించడానికి నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ సహకారంతో అప్పటి మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మొదట్లో గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే నిర్మించాలని నిర్ణయించిన తర్వాత మరో రూ.4 కోట్లు అదనంగా మంజూరు చేసి జీ-ప్లస్ వన్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా చురుకుగా సాగిన పనులు ప్రభుత్వం మారడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పనులు పూర్తయితే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వ్యాపారులు, ప్రజలు కోరుతున్నారు.
సమస్యలకు నిలయంగా నర్సాపూర్
నర్సాపూర్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లేకపోవడంతో ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ఎక్కువైంది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లేకపోవడంతో కూరగాయలు, పండ్లు, పూలు తదితర వ్యాపారులు రోడ్ల పక్కన, వీధుల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నది. అడుగు తీసి అడుగు ముందుకు వేయలేకపోతున్నామని వాహనదారులు వాపోతున్నారు. రోడ్లకు ఇరువైపులా దుకాణాలు ఉండడంతో ప్రజలు వాహనాలను రోడ్లపైనే నిలిపి కూరగాయలను, పండ్లను, పూలను కొనుగోలు చేయడంతో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఎస్బీఐ శాఖ నుంచి పోస్టాఫీస్ వరకు మంగళ, శుక్రవారాల్లో మార్కెట్ నిర్వహించుకోవడానికి మున్సిపల్ అధికారులు నూతనంగా అనుమతులు ఇచ్చారు. అదే మార్గంలో పోలీస్ స్టేషన్, బ్యాంకులు, పోస్టాఫీస్, మున్సిపల్, తదితర కార్యాలయాలు ఉండడంతో ప్రజలు వెళ్ల్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మటన్, చికెన్, చేపలు ఒక్కచోట విక్రయించకపోవడంతో ప్రజలు చాలా దూరం నడవాల్సి వస్తున్నది. ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణాన్ని పూర్తిచేస్తే ఈ దుకాణాలన్ని ఒకే చోటికి రావడంతో ప్రజలకు ఎంతగానో సౌకర్యంగా మారుతుంది. ట్రాఫిక్ సమస్య నుంచి వాహనదారులకు ఉపశమనం లభిస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని ప్రజలు, వ్యాపారులు, రైతులు కోరుతున్నారు.