లండన్ : కొద్దిరోజుల క్రితమే పారిస్ వేదికగా ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో టైటిల్ కోసం ఎర్రమట్టి కోర్టులో కొదమసింహాల్లా పోరాడిన టాప్ సీడ్ యానిక్ సిన్నర్ (ఇటలీ), కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్) మరోసారి రసవత్తర పోరుకు సిద్ధమయ్యారు. ఈసారి వీళ్ల టైటిల్ పోరుకు పచ్చికతో కూడిన వింబుల్డన్ సెంటర్ కోర్టు వేదిక కానుంది. ఈ ఇరువురూ శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్లో తమ ప్రత్యర్థులను మట్టికరిపించి ఫైనల్కు అర్హత సాధించారు.
ఈ టోర్నీలో హ్యాట్రిక్ టైటిల్ దక్కించుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్.. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి సెమీస్లో 6-4, 5-7, 6-3, 7-6 (8/6)తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)ను ఓడించాడు. ఇక రెండో సెమీస్లో సిన్నర్.. 6-3, 6-3, 6-4తో నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను వరుస సెట్లలో చిత్తుచేసి తొలిసారి వింబుల్డన్ ఫైనల్ చేరాడు. కెరీర్లో 25వ టైటిల్ సాధించాలనే ఆశయంతో బరిలో నిలిచిన జొకోకు మరోసారి నిరాశే ఎదురైంది.