పరిగి, డిసెంబర్ 14: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో ట్రాక్టర్‌తో ఢీకొట్టించి హత్య చేయించింది. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా, చివరకు పన్నిన పన్నాగం పోలీసులకు తెలియటంతో ప్రియుడితోపాటు కటకటాలపాలైంది. ఆదివారం పరిగిలోని సీఐ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాస్ విలేకరులకు వెల్లడించారు.
ఈనెల 13న ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని చౌడాపూర్కు చెందిన కర్రె రత్నయ్య మృతిచెందాడు. అతడి భార్య కర్రె కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే రత్నయ్య మృతిపై కర్రె కవిత, చౌడాపూర్ గ్రామానికి చెందిన దాసరి రామకృష్ణపై అనుమానం ఉన్నదని మృతుడి సోదరుడు దేవయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కర్రె కవిత, దాసరి రామకృష్ణలను అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. నాలుగేండ్లుగా కర్రె కవిత, దాసరి రామకృష్ణల మధ్య అక్రమ సంబంధం కొనసాగుతున్నది. ఈ విషయం కవిత భర్త రత్నయ్యకు తెలియడంతో ఇలాంటివి మానుకోమని హెచ్చరించాడు. దీంతో కవిత తన ప్రియుడు రామకృష్ణ కలిసి రత్నయ్యను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నది.
ఈ క్రమంలో 13న ఉదయం కర్రె రత్నయ్య తన పొలానికి వెళుతుండగా రామకృష్ణ మార్గమధ్యంలో ట్రాక్టర్‌తో రత్నయ్యను ఢీకొట్టగా తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు దాసరి రామకృష్ణ, కర్రె కవితలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ ఎస్ శ్రీనివాస్‌రెడ్డి, కులకచర్ల ఎస్ఐ వీ రమేశ్‌లు పాల్గొన్నారు.