న్యూఢిల్లీ, ఆగస్టు 30 : ట్రంప్ మరణించారా?, ట్రంప్‌కు ఏమైంది, ఆయన ఆరోగ్యంగా లేరా?.. ఇవీ ప్రస్తుతం గూగుల్ సెర్చ్, సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ట్రెండింగ్‌లో ఉన్న అంశాలు. కొద్ది రోజులుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగా కన్పించకుండా అదృశ్యం కావడం, ట్రంప్‌నకు ఏదైనా అయితే తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతానంటూ ఉపాధ్యక్షుడు వ్యాన్స్ తాజాగా చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ ఆరోగ్యంపై తీవ్ర సందేహాలు, ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆయన కుడిచేతిపై గాయాలతో కన్పించడం, అది సామాజిక మాధ్యమంలో వైరల్ కావడం కూడా ఈ అనుమానాలను ఆజ్యం పోసినట్టయ్యింది. ‘ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు.
అందుకే కొద్ది రోజులుగా బయటకు కూడా రావడం లేదు’ అంటూ సామాజిక మాధ్యమంలో చర్చలు ప్రారంభమయ్యాయి. ‘ట్రంప్ మరణించాడు’, ‘ట్రంప్ మరణించారా?’ అన్న పదాలతో లక్ష మందికి పైగా సెర్చ్ చేశారంటే ఇది ఎంత తీవ్రంగా ప్రభావం చూపిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నెల 26న టెలివిజన్‌లో ప్రసారమైన క్యాబినెట్ సమావేశంలో ట్రంప్ ఆఖరిసారిగా కన్పించారు. అప్పటి నుంచి ఆయన బహిరంగ కార్యక్రమాలకు హాజరు కాలేదు. ట్రంప్ కొద్దికాలంగా చీలమండల వాపు, కుడిచేతిపై గాయంతో బాధపడుతున్నారు. అయితే వీటిపై శ్వేతసౌధం స్పందించ లేదు.