రైతు కోసం.. రైతన్న బాగు కోసం రాష్ట్ర మంత్రులు అవమానాలను భరించారు.. కేంద్రమంత్రులు హేళన చేస్తే తట్టుకొన్నారు.. వాళ్ల తలుపుల వద్ద గంటల తరబడి వేచిచూశారు.. లక్ష్యం ఒక్కటే.. రైతుల ధాన్యం కేంద్రంతో కొనిపించాలి
కానీ, కేంద్ర పెద్దలు కొనబోమన్నరు.. మీకేం పని లేదన్నరు. ఆ అవమాన ఫలితం.. ఆక్రోశం వైపు వెళ్తున్నది.
ఆ హేళన పర్యవసానం.. మహోగ్ర ఉద్యమంవైపు మళ్లుతున్నది. పంట కొనకపోతే రైతు కడుపు ఎండుతదని, అదే జరిగితే కేంద్రం తీరును ఎండగట్టేలా వరి యుద్ధానికి సిద్ధమైంది టీఆర్ఎస్ సర్కారు!
చెప్పినా వినకపోతే ఢిల్లీ దద్దరిల్లేలా, మరో తెలంగాణ లాంటి ఉద్యమానికీ సై అంటున్నది.
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు చేయండి. లేదంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు. రాజకీయాలను పక్కనపెట్టి రైతుల కోసం ఆలోచించండి’.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు, ఇతర మంత్రులు, అధికారులు కేంద్ర ప్రభుత్వానికి చేస్తున్న విజ్ఞప్తి ఇది. కానీ.. కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం తెలంగాణపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నది. రైతులకోసం రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడటం ఏంటన్న తీరున వివక్షకు దిగుతున్నది. కాళ్లరిగేలా ఢిల్లీ చుట్టూ తిరిగినా.. ఫలితం లేదు. పైగా.. మీకు వేరే పనేమీ లేదా? అంటూ స్వయానా కేంద్రమంత్రే రాష్ట్ర మంత్రులను దారుణంగా అవమానించారు. ఈ నేపథ్యంలో రైతులకు మేలు చేయాలని అడగటమే రాష్ట్ర మంత్రులు చేసిన పాపమా? రైతులకు మేలు చేయాలని కోరితే మంత్రులను అవమానిస్తారా? అని తెలంగాణ సమాజం నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రులు వరుసగా అవమానాలకు గురిచేస్తున్నా.. రాష్ట్ర మంత్రులు మాత్రం తెలంగాణ రైతుల కోసం అన్నీ భరించారు. కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయించడమే లక్ష్యంగా రోజుల తరబడి ఢిల్లీలో మకాం వేశారు. 10 సార్లు ఢిల్లీకి.. ఐదుసార్లు కేంద్ర మంత్రితో భేటీ గత యాసంగి బియ్యం మొత్తం తీసుకోవాలని, ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతుల పక్షాన సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, అధికారుల బృందా లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేశాయి. స్వయంగా సీఎం కేసీఆర్ రెండుసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి పీ యూష్ గోయల్‌తో భేటీ అయ్యి ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీకి స్వయంగా లేఖలు రాశారు. మీడియా వేదికగా పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు మంత్రులు, అధికారుల బృందాలు పదిసార్లకు పైగా ఢిల్లీకి వెళ్లారు. ఏకంగా ఐదుసార్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యి ధాన్యం కొనాలని విన్నవించారు.
రాష్ట్ర రైతాంగం కోసం ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారి రాష్ట్ర మంత్రుల బృందానికి అవమానాలు తప్పలేదు. గత డిసెంబర్లో అయితే కేంద్ర మంత్రి పీయూష్ గోయ ల్ కావాలనే మన మంత్రులు, ఎంపీలను అవమానించటం గమనార్హం. ఆయన ఆఫీసు ముందు గంట ల తరబడి వేచిచూసినా మంత్రులకు సమయమివ్వలేదు. ఒక దశలో పీయూష్ గోయల్ మన మంత్రులతో ‘ఢిల్లీకి ఎందుకొచ్చారు.. మీకు అక్కడ ఏం పనిలేదా, ఢిల్లీలో ఉండటమే మీకు ఇష్టమా?’ అని వెటకారంగా మాట్లాడటం గమనార్హం.
2022 నాటికి రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని గొప్పలకు పోయిన ప్రధాని మోదీ.. తీరా చూస్తే రెట్టింపు సంగతి దేవుడెరుగు.. ఉన్న ఆదాయాన్ని తగ్గిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు తెలంగాణే ఉదాహరణ. పార్లమెంట్ సాక్షిగా ‘తెలంగాణ రైతుల నుంచి యాసంగిలో ధాన్యం(బాయిల్డ్ రైస్) కొనబోం’ అని కేంద్రం ప్రకటించింది. ఈ విషయంపై శనివారం నాటి సీఎం ఉన్నతస్థాయి సమీక్ష లో చర్చించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రైతుల సంక్షేమం కోసం కేంద్రం మెడలు వంచైనా ధాన్యం కొనుగోలు చేయించాలని, లేకపోతే తెలంగాణ రైతు లు రోడ్డున పడతారని ముక్తకంఠంతో వ్యాఖ్యానించినట్టు సమాచారం.
నిర్మల్ టౌన్, మార్చి 20 : తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం జరిగిన నిర్మల్ జడ్పీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పంజాబ్, గుజరాత్ రాష్ర్టాలకు ఒక న్యాయం.. తెలంగాణకు మరో న్యాయమా? ఇదేనా ప్రధాని మోదీ లౌకికవాదమని ప్రశ్నించారు. ఆయా రాష్ర్టాల్లో పండిన ధాన్యం, గోధుమలు కొనుగోలు చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు కొనుగోలు చేయరని నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రైతులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం పండితే జీర్ణించుకోలేకనే కొనుగోళ్లపై ఆంక్షలు విధిస్తున్నట్టు ఆయన దుయ్యబట్టారు. కేంద్రం మెడలు వంచైనా ధాన్యం కొనుగోలు చేసేలా కేసీఆర్ నాయకత్వంలో రైతు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.