బెంగళూరు, ఫిబ్రవరి 16: హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో నాలుగో రోజూ బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా తరగతి గదుల్లో హిజాబ్‌ను ధరించడంపై ఆంక్షలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థినుల తరపున న్యాయవాది రవివర్మ కుమార్ కీలకమైన వాదనలు వినిపించారు. ఈ సమాజంలో వివిధ మతాలకు చెందిన వ్యక్తులు ధరించే కంకణాలు, తలపాగాలు, మేనిముసుగు, శిలువ, బొట్టు, దుపట్టాలు వంటి వందలాది మతపరమైన గుర్తులు ఉండగా.. ముస్లిం మహిళలు ధరించే హిజాబ్‌ను మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు వేరుగా చూస్తున్నారని న్యాయమూర్తులను అడిగారు. సమాజంలోని అన్ని వర్గాల్లో మతపరమైన చిహ్నాలకు సంబంధించి ఉన్న వైవిధ్యం గురించి మాత్రమే తాను ఇక్కడ చెబుతున్నానని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఒక్క హిజాబ్‌ను మాత్రమే ఎంచుకొని ఎందుకు విద్వేషపూరిత వివక్ష చూపుతున్నది? అని ప్రశ్నించారు. ‘హిజాబ్ ధరించిన విద్యార్థినిని ఆమె మతం కారణంగానే తరగతి నుంచి బయటకు పంపుతున్నారు. బొట్టు, గాజులు లేదా శిలువ గుర్తు వంటి వాటిని ధరించిన వారిని పంపడం లేదు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ఉల్లంఘన’ అని అన్నారు.