నేటితరం అమ్మాయిలు కేవలం ఉద్యోగం సంపాదించడమే కాదు, తమకంటూ ఒక ‘ఆర్థిక సామ్రాజ్యాన్ని’ నిర్మించుకోవడంలో దూసుకుపోతున్నారు. అయితే, సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని సరైన రీతిలో దాచుకోవడం అంతే అవసరం. మన చేతిలో ఉండే డబ్బు సమాజంలో గౌరవాన్ని మాత్రమే కాదు, అత్యవసర సమయాల్లో ఎవరి ముందూ తలవంచకుండా నిలబడే ఆత్మవిశ్వాసాన్నీ ఇస్తుంది. దీన్నే మనం ‘ఫ్రీడమ్ ఫండ్’ అనుకోవచ్చు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. హఠాత్తుగా ఉద్యోగం మారాల్సి రావడం, కెరీర్లో బ్రేక్ తీసుకోవడం లేదా ఏదైనా వ్యక్తిగత అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ఈ ఫండ్ రక్షణ కవచంలా పనిచేస్తుంది.
మరి దాన్ని ఎలా సమకూర్చుకోవచ్చంటే … బడ్జెట్ ప్లానింగ్: ప్రతి నెల సంపాదనలో కనీసం 20 శాతం పొదుపు ఖాతాలోకి వెళ్లేలా చూసుకోవాలి. పెట్టుబడులపై అవగాహన: బంగారం మాత్రమే కాకుండా మ్యూచువల్ ఫండ్లు, రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లలాంటి పెట్టుబడుల పైనా అవగాహన పెంచుకోవాలి. ఆర్థిక విషయాల్లో భాగస్వామ్యం : ఇంట్లో ఆర్థిక నిర్ణయాల్లో మీరు కూడా పాలుపంచుకుంటూ ఎక్కడ ఖర్చు తగ్గించవచ్చో ఆలోచిస్తూ ముందుకు వెళ్లాలి. అవకాశం ఉన్నప్పుడు ఫ్రీ లాన్సింగ్ వర్కులు చేయడంతో పాటు అనవసరమైన షాపింగ్ తగ్గించుకోవడం కూడా కొత్త సంపాదన మార్గమే!