మారుతున్న జీవనశైలితో ముప్పయ్ దాటగానే.. వయసు పైబడినట్టు కనిపిస్తున్నారు. అందం విషయంలోనే కాదు.. ఆరోగ్యపరంగానూ చిన్నవయసులోనే పెద్దవాళ్లలా కనిపిస్తున్నారు. ముఖంపై ముడతల దగ్గరి నుంచి.. ఫిట్నెస్ వరకూ వయసు మీరుతున్నారు. ఈ సమస్య నుంచి బయట పడేందుకు కొందరు వేలకు వేలు పోసి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఇంకొందరు లక్షలకు లక్షలు పెట్టి.. ఆసుపత్రుల వెంట పరుగులు పెడుతుంటారు. ఇవేవీ కాకుండా.. చిన్నపాటి జాగ్రత్తలు, జీవనశైలిలో మార్పులతోనే వృద్ధాప్యాన్ని ప్యాక్ చేసి పక్కన పెట్టేయొచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
మానసిక ఒత్తిడి వృద్ధాప్యానికి దగ్గర చేస్తుంది. కాబట్టి, ధ్యానం, యోగా లాంటివి చేస్తూ.. ఒత్తిడిని తగ్గించుకోవాలి. సానుకూలంగా ఉండటం, సంతోషంగా గడపడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా, రూపంలోనూ సానుకూల మార్పులు కనిపిస్తాయి.
ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండటం కూడా వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. కాబట్టి, రోజూ శరీరానికి కావాల్సినన్ని నీళ్లు తాగాలి. దాంతో, చర్మం తేమగా ఉంటూ, ఒంట్లోని ట్యాక్సిన్స్‌ను ఎప్పటికప్పుడు బయటికి వెళ్లిపోతాయి.
సమతుల ఆహారం తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటుంది. తాజా కూరగాయలు, పండ్లతోపాటు యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు, బెర్రీలు, ఆకుకూరలు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు.. వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి.
రోజుకు 7-8 గంటల నాణ్యమైన నిద్ర.. చర్మ నాణ్యతనూ పెంచుతుంది. నిద్రలో ఉన్నప్పుడు శరీరం కణాలను మరమ్మతు చేస్తుంది. ఫలితంగా ముడతలు, డల్‌నెస్ తగ్గుతుంది.
యూవీ కిరణాలు.. చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ముఖంపై మచ్చలు, ముడతలకు కారణమవుతాయి. ఎండలో ఎక్కువగా తిరిగితే.. వృద్ధాప్యానికి దగ్గరవుతారు. కాబట్టి, బయటికి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోండి. ముఖ్యంగా ఈ వేసవిలో చేతిలో గొడుగు, నెత్తిన టోపీ ఉండేలా చూసుకోండి.
ఇక శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి నిత్య వ్యాయామం తప్పనిసరి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల శరీరం దృఢంగా మారడమే కాదు.. చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది. వ్యాయామంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మానికి ఆక్సిజన్‌తోపాటు అన్ని పోషకాలనూ అందిస్తుంది. ఒత్తిడితోపాటు చర్మంపై వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.