‘పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగుతూ ఎవరూ చూడటం లేదని అనుకుంటుంది’.. ప్రభుత్వ భూముల పరిరక్షణలో హైడ్రా తీరు కూడా ఇలానే ఉన్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటిదాకా పేదలు, పెద్దలు అనే తారతమ్యాల ప్రాతిపదికన కూల్చివేతల పర్వం జరిగిందనేది జగమెరిగిన సత్యం. నోటీసు ఇవ్వాల్సిన అవసరంలేదంటూ నిరుపేదల నిర్మాణాలను నేలమట్టం చేసిన సందర్భాలు కోకొల్లలైతే… పెద్దోళ్లకు మాత్రం హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేదాకా వేచి చూసిన ఉదాహరణలు అనేకం.ప్రభుత్వ భూముల పరిరక్షణలోనూ ఇలాగే ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. హైడ్రా బుల్డోజర్ నాదర్గుల్లో రాజీపడగా, ఐలాపూర్‌లో మాత్రం నిర్మాణాలను నేలమట్టం చేస్తూ ‘నిబంధనల మేరకే పని చేస్తున్నం’ అంటూ ప్రచారం చేసుకుంటున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో హైడ్రా పనితీరు మరోసారి తీవ్ర వివాదాస్పదమైంది. సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని ప్రభుత్వ భూముల విషయంలో, ఐలాపూర్‌లోని భూముల విషయంలో హైడ్రా తీసుకున్న చర్యలపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. సాక్షాత్తు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి.. సచివాలయం వేదికగా నాదర్గుల్ భూములను ‘ప్రభుత్వ భూములు’గా ప్రకటించగా, హైడ్రా కమిషనర్ మాత్రం వాటిని ప్రైవేటు భూములుగా నిర్ధారించడం విశేషం. మరోవైపు వారం రోజులపాటు నిఘా వేసి భారీ బుల్డోజర్లతో ఐలాపూర్‌లోని నిర్మాణాలను హైడ్రా బుల్డోజర్ నేలమట్టం చేసింది. ఐలాపూర్‌లో సర్కారు భూములుగా చెప్తున్న సర్వేనెంబర్లు నిషేధిత జాబితాలో లేవు, కానీ నాదర్గుల్ భూములు ఇప్పటికీ 22-ఏ కింద నిషేధిత జాబితాలో రాష్ట్ర ప్రభుత్వ భూములుగా నమోదై ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో అసలు ఏం జరుగుతున్నదని అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఐలాపూర్‌లో కూల్చివేతలు జరిపిన హైడ్రా బుల్డోజర్.. రైతుల్ని బెదిరింపులకు గురి చేస్తూ ప్రభుత్వ భూములను చెరబట్టిన ప్రైవేటు కంపెనీలవైపు పోయేందుకు మాత్రం ఎందుకో జంకుతున్నదని ప్రశ్నిస్తున్నారు. ఈ తతంగం తెరవెనక ప్రభుత్వ పెద్దలు ఉన్నారనేందుకు హైడ్రా చర్యలే బలాన్ని చేకూరుస్తున్నాయని నాదర్గుల్ రైతులు అభిప్రాయపడుతున్నారు. రెండుచోట్ల ఉన్న ప్రభుత్వ భూముల వెనక ఉన్న వాస్తవాలు, ప్రభుత్వ రికార్డులను బేరీజు వేసుకుంటే హైడ్రా బుల్డోజర్ ‘రాజీ’కీయం చేస్తున్నదని స్పష్టమవుతున్నది.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్‌లో సర్వే నెంబర్ 1 నుంచి 220 వరకు 1263 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమి నిజాంకు చెందినదిగా రికార్డుల్లో ఉన్నది. వీటిని ‘సర్ఫేఖాన్ భూములు’గా పిలుస్తారు. పూర్వం ఈ భూములకు యజమానిగా ఇమామ్అలీ ఉండగా, ఆయన ముస్తఫా హుస్సేన్‌కు వాటిని విక్రయించారని చెప్తారు. 1956కు పూర్వమే మోజిజ్ కమిటీ ఈ భూములకు ముస్తఫా హుస్సేన్‌ను పట్టాదారుగా గుర్తించాలని ఆదేశాలు జారీచేసింది. 1958లో ముస్తాఫా చనిపోయిన తర్వాత ఆయన వారసులు ఫౌతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు పాత యజమాని ఇమామ్ అలీ వారసులు సైతం అవి తమకు చెందిన భూములుగా క్లెయిమ్ చేశారు. ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదం 1960 దశకంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ముందు విచారణకు వచ్చింది. వాదోపవాదాలు జరిగాయి. 1970 దశకంలో ఇరువర్గాలు జిల్లా కోర్టును ఆశ్రయించగా చివరకు రాజీ డిక్రీ వెలువడింది. కోర్టు డిక్రీ ప్రకారం రెవెన్యూ అధికారులు ఇద్దరు వారసుల పేర్లను రికార్డుల్లో చేర్చి, సంబంధిత వాటాలతో డిక్రీని ప్రకటించారు. ఆ తర్వాత భూ సంస్కరణల (సీలింగ్) చట్టం-1975 అమలులోకి వచ్చింది. దీంతో సుమారు 861 ఎకరాలను సీలింగ్ సర్‌ప్లస్‌గా నిర్ధారించారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ విడుదల చేసిన ప్రకటనలో ఉన్నది. 1981లో సప్లిమెంటరీ సేత్వార్‌లో పట్టా భూమిగా ఉండటంతో, దాని ఆధారంగా కొందరు రైతులకు కోర్టుల నుంచి తీర్పులు వచ్చాయి. దీంతో సర్వేనెంబర్ 119 నుంచి 220 వరకు 408 ఎకరాల విస్తీర్ణంలో రాజగోపాల్‌నగర్ పేరిట 1983లో లేఅవుట్ చేసి ప్లాట్లుగా విక్రయించారు. ఇలా 1980వ దశకంలోనే అక్కడ 495 ఎకరాలతో రాజగోపాల్‌నగర్ కాలనీ, 131 ఎకరాలతో విద్యుత్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఏర్పడ్డాయి. అంటే 1,263 ఎకరాల్లో ఏ సర్వేనెంబర్లలోని భూములు వారసులకు చెందుతాయి? ఏ సర్వేనెంబర్లలోని భూములుగా సీలింగ్ సర్‌ప్లస్‌గా ఉన్నాయనే దానిపై స్పష్టత లేదు. దీంతో ఈ అంశాలను తేల్చేందుకు అప్పటి జాయింట్ కలెక్టర్ భీమానాయక్ విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. ఇదే నివేదికను అప్పటి హైకోర్టు జస్టిస్ రోహిణి ఏకసభ్య ధర్మాసనం సమర్థించింది. అనంతరం ఈ భూములపై న్యాయస్థానాల్లో అనేక పిటిషన్లు దాఖలు కావడంతో హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు వచ్చాయి. ఇప్పటికీ ఆ ఉత్తర్వులు అమలులో ఉన్నట్టు బాధితులు చెప్తున్నారు. హైడ్రా కూడా దానికి అంగీకరిస్తున్నది. కాకపోతే స్టే ఉత్తర్వులు అమలులో ఉన్న సమయంలో నిర్మాణాలు చేపట్టినందుకుగాను శనివారం కూల్చివేతలు చేపట్టినట్టు హైడ్రా అధికారులు తెలిపారు. సీలింగ్ సర్‌ప్లస్‌గా ప్రకటించిన 861 ఎకరాలను కాపాడినట్టు సంస్థ తెలిపింది. గ్రామస్తులు, ఐలాపురం తండా వాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసినట్టు తెలిపింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం పెండింగులో ఉన్న రిట్ అప్పీళ్లపై తుదినిర్ణయం వచ్చేవరకు సంబంధిత భూములను యథాతథ స్థితిలో పరిరక్షించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది. అంటే ఈ భూముల భవిష్యత్తు కోర్టు ఉత్తర్వులపై ఆధారపడి ఉన్నదన్నమాట. ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా తీర్పు వస్తే, వాటిని వారికి అప్పగించాల్సిందే.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని నాదర్గుల్ సర్వేనెంబరు 613 (పాత సర్వేనెంబరు 119)లో ఉన్న 373.22 ఎకరాల భూమి 1954-55 ఖాస్రా పహాణీలో దస్తగర్ధన్, పట్టాదారు కాలంలో శివరాజ్ ఇలాకాగా నమోదైంది. అప్పటినుంచి ఈ క్షణం వరకు రెవెన్యూ రికార్డుల్లో అది ప్రభుత్వ భూమిగానే కొనసాగుతున్నది. 22-ఏ నిషేధిత జాబితాలో భూములు ఉన్నాయి. 2006లో (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) ఈ భూములపై రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కావడం, రంగారెడ్డి జిల్లా కోర్టు, హైకోర్టు చివరకు సుప్రీంకోర్టు దాకా అనేక పిటిషన్లు దాఖలు కావడంతో.. కొన్నిసార్లు ప్రైవేటుకు, మరికొన్నిసార్లు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. 2015లో అవి ప్రైవేటు భూములుగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ ప్రక్రియ జరగలేదు. పైగా మ్యుటేషన్ ప్రక్రియ చేయకపోవడంపై ప్రైవేటు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించగా, సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ రెండుచోట్లా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. వాటిని సవాల్ చేస్తూ ప్రైవేటు వ్యక్తులు తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ కేసు కొనసాగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే 2005 మార్చిలో 373.22 ఎకరాల భూములు ప్రభుత్వానికి చెందినవిగా పేర్కొంటూ, సుదీర్ఘమైన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అవి ప్రభుత్వ భూములేనని ప్రకటించి, వాటిని తమ ప్రభుత్వం కాపాడుతుందని చెప్పుకొచ్చారు. కానీ హైడ్రా మాత్రం ఇప్పటివరకు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఐలాపూర్ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లోనే అంతా గందరగోళంగా ఉన్నది. 22ఏ నిషేధిత జాబితాలో ఇప్పటికీ ఆ సర్వే నంబర్లు కనిపించడం లేదు. అయినా హైడ్రా సీలింగ్ సర్ప్లస్ కింద 861 ఎకరాలను స్వాధీనం చేసుకొని సంరక్షిస్తున్నామనడం సమంజసమే కావచ్చు. మరి ఇదేసూత్రం నాదర్గుల్ భూములకు ఎందుకు వర్తించదనేది కీలకమైన ప్రశ్న. పైగా ఆ భూములు నిషేధిత జాబితాలో ఉండగా, క్షేత్రస్థాయిలో ప్రైవేటు కంపెనీలు తమ ఆధీనంలోకి తీసుకొని ప్రహరీ నిర్మిస్తున్నాయి. ఏండ్లుగా అందులో సాగు చేసుకుంటున్న సామాన్య రైతులను రానీయకుండా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేశాయి. ఆ కంపెనీలు అనధికారికంగా ఇతర కంపెనీలతో అనేక ఒప్పందాలు కూడా చేసుకుంటున్నాయి. రాత్రికి రాత్రి వాటిల్లో ఏ నిర్మాణాలు వెలుస్తాయో కూడా అర్థం కాని పరిస్థితి. ఐలాపూర్‌లో మాదిరిగా నాదర్గుల్లోనూ ప్రైవేట్ కంచెను హైడ్రా నేలమట్టం చేసి, చుట్టూ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలి కదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నాదర్గుల్ భూములను ప్రైవేటు భూములుగా చెప్పారని స్వయానా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. కానీ ఆ భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి, సంతకం చేసిన ఉత్తర్వులు ఇప్పటికీ వెబ్సైట్లో ఉన్నాయి. ఒకవేళ ఆ భూములపై కోర్టు వివాదాలు కొనసాగుతున్నాయనే కారణంతో అక్కడికి వెళ్లలేదని హైడ్రా చెప్పే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు సింగిల్, డివిజన్ బెంచ్ ఉత్తర్వులు ఉన్నాయి. సుప్రీంకోర్టులో కొనసాగుతున్న కేసుకు సంబంధించి ఇంకా తుదితీర్పు రాలేదు. అంటే హైడ్రా ఆ భూముల్ని స్వాధీనం చేసుకొని కబ్జా కాకుండా కాపాడి, సుప్రీంకోర్టు తుది తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తే అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఐలాపూర్‌లో అమలు చేసిన న్యాయం అదే కదా!.
సర్వేనెంబరు 613లో ఏడు దశాబ్దాల నుంచి నాదర్గుల్ గ్రామానికి చెందిన దాదాపు 143కు పైగా రైతు కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ అవే జీవనాధారంగా బతుకుతున్నాయి. కందుకూరు ఆర్డీవో సుప్రీంకోర్టుకు వేసిన కౌంటర్ అఫిడవిట్లోనూ ఇదే విషయాన్ని పొందుపర్చారు. అంటే రెవెన్యూ రికార్డులపరంగానూ ఆ రైతులు ప్రొటెక్ట్ టెనెంట్ కిందకు వస్తారు. మరి ఆ కోణంలోనూ ఆ భూములపై హక్కులు ఉండీ.. తాతల ముత్తాతల నుంచి వస్తున్న భూముల్లోకి రానీయకుండా ప్రైవేటు వ్యక్తులు అడ్డుకుంటే, ఆ రైతులకు హైడ్రా న్యాయం చేయాల్సిన అవసరముంది కదా! అని
ప్రశ్నిస్తున్నారు.
ఐలాపూర్‌లో 1,263 ఎకరాలు పూర్వం నుంచి ప్రభుత్వానికి చెందినవి కావు. నిజాంకు చెందినవి. తదుపరి పలువురికి దఖలు పడ్డాయి. కానీ 1975లో వచ్చిన సీలింగ్ చట్టాన్ని అమలు చేయడం ద్వారా 861 ఎకరాలు ప్రభుత్వ ఖాతాలో వచ్చాయి. కానీ ఆ విస్తీర్ణం ఏయే సర్వేనంబర్లలో ఉందనేది ఇంకా నిర్ధారణ కాలేదు. నాదర్గుల్ భూముల్లో ప్రైవేటు వ్యక్తుల భూమిగా చెప్పబడుతున్న శివరాజ్ బహదూర్‌కు సర్వేనంబర్-613లో 373.22 ఎకరాలతో పాటు ఇదే గ్రామ పరిధిలోని సర్వేనంబరు 320లో 3.25 ఎకరాలు, 440లో 4.29 ఎకరాలు, 364లో 15.30 ఎకరాలు, 284లో 6.22 ఎకరాలు, 567లో 4.03 ఎకరాలు, 875లో 8.29 ఎకరాలు, 721లో 72.11 ఎకరాలు, 664లో 523.10 ఎకరాలు ఇలా మొత్తం 1012.22 ఎకరాల భూములు ఉన్నాయి. ఇవేకాకుండా ఇర్విన్, ఇతర గ్రామాల్లోనూ శివరాజ్ బహదూర్‌కు భారీ విస్తీర్ణంలో భూములు ఉన్నాయి. అంటే భూసంస్కరణలు (సీలింగ్) చట్టం-1975 కచ్చితంగా అమలవుతుంది. ఐలాపూర్‌లో జరిగింది కూడా అదే. ఈ చట్టం అమలుతో 613 సర్వేనెంబరులోని 373.22 ఎకరాలు కచ్చితంగా ప్రభుత్వ ఖాతాలో వస్తుందని కందుకూరు ఆర్డీవో సుప్రీంకోర్టుకు వేసిన కౌంటర్ అఫిడవిట్లోనూ స్పష్టం చేశారు. దీని ప్రకారమైనా హైడ్రా ఆ భూములను స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది.