సాయుధ పోరాటాన్ని ఎందుకు విరమించాల్సి వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కునే సందర్భంలో, ముందుగా ఉద్యమాల స్వరూప స్వభావాలను బుద్ధిజీవులందరూ అవగాహన చేసుకోవాల్సి ఉంది. ఏ ఉద్యమంలోనైనా భావజాల వ్యాప్తిని కలిగించి, పటిష్ఠ నిర్మాణాన్ని చేయడంలో ఎన్ని ఆటుపోట్లు ఉంటాయో, ఉద్యమాన్ని నడిపించి విజయతీరాలకు చేర్చడంలో అంతకు రెట్టింపు ఒడుదొడుకులు, ఆటంకాలు, తిరోగమన పురోగమనాలు, విద్రోహాలు, వ్యూహాత్మక విరమణలూ ఉంటాయి.
విప్లవం నల్లేరుపై నడకలా సాగేదికాదు. శత్రువు బలాబలాల సమీకరణలు, ఎన్నో వ్యూహాలు, మరెన్నో ఎత్తుగడలు, ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు, కొంత విరామం, ఆపై విజృంభణ& అన్నీ పోరాటంలో భాగమే! మిలిటరీ భాషలో చెప్పాలంటే, యుద్ధంలో సైన్యం పూర్తిగా లొంగిపోవడమో లేదా తిరిగి యుద్ధం చేసే సంకల్పాన్ని విడనాడడమో మాత్రమే విద్రోహం అవుతుంది. కొద్దిమంది మావోయిస్టుల పోరాట విరమణ ఉద్యమంలో స్వల్ప విరామం మాత్రమే. సంకల్పాన్ని విడనాడడం కాదు. విరమణ విద్రోహం కాదు. ఊపిరి పీల్చుకొని, కొత్త శక్తిని నింపుకొని మరో మహాసంగ్రామానికి మనను మనం సన్నద్ధం చేసుకోవడంలో ఓ ఎత్తుగడే ఈ విరమణ. యుద్ధంలో సైన్యాన్ని ముందుకు నడిపే నైపుణ్యమే కాదు, సమయానుకూలంగా వెనక్కు మరల్చే విజ్ఞత కూడా ఉండాలి. ఆ విజ్ఞత చూపకపోవడం వల్లే చరిత్రలో నెపోలియన్, హిట్లర్ లాంటి మహాశక్తివంతుల సేనలు కూడా మట్టి కరవక తప్పలేదు. ఉద్యమాన్ని నడిపేవారికి ఉద్యమంలో పాల్గొనే వారి శ్రేయస్సు గురించి ఆలోచించాల్సిన ప్రధాన బాధ్యత కూడా ఉంటుందని మరువరాదు.
జపాన్ కు వ్యతిరేకంగా చైనా సాగించిన యుద్ధం కానీ, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా సాగిన భారత స్వాతంత్య్రోద్యమం కానీ, దీర్ఘకాలికంగా నడిచాయే కానీ, నిరంతరంగా, విరామం లేకుండా సాగినవి కావు. దీర్ఘకాలిక యుద్ధం, సరియైన వ్యూహం,ఎత్తుగడల ద్వారా,ఆంధ్రప్రదేశ్ కన్నా చిన్నదైన వియత్నాం,అగ్రరాజ్యమైన అమెరికాను ఓడించగలిగింది. ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. రాజకీయాల కొనసాగింపే యుద్ధం.రక్తపాతం లేని యుద్ధమే రాజకీయాలు. ప్రాచీన చైనా మిలిటరీ యుద్ధతంత్ర సిద్ధాంతకర్త సంజు తన పుస్తకం ‘ఆర్ట్ ఆఫ్ వార్’లో చెప్పినట్టు శత్రువును సరిగ్గా అర్థం చేసుకొని, తనను తాను అర్థం చేసుకుంటే, వంద యుద్ధాలనైనా ఓటమి లేకుండా అవలీలగా గెలువవచ్చు.
మొండిగా, మూర్ఖంగా ముందుకు సాగి, ప్రజానీకాన్ని కష్టనష్టాలు పెట్టి, ఉన్న క్యాడర్ను కోల్పోయి ఉద్యమ లక్ష్యాలను దెబ్బతీయడం తీవ్రవాదమవుతుంది. ముఖ్యంగా అవకాశవాదుల, ఉద్యమంలో తీవ్రవాదుల మరియు శత్రువు యొక్క అవహేళనలకు, దుర్మార్గ ప్రచారానికి ఏ మాత్రం గురికాకుండా, ఆవేశపడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యమంలో పోరాట రూపాలను ప్రజలే ఆవిష్కరిస్తారు. ఆ విధంగా ఆవిష్కరించిన పోరాట రూపాలను ఉద్యమ నాయకత్వం ఉపయోగించుకోవాలి.
లెనిన్ మాటల్లో చెప్పాలంటే , ఏ ఉద్యమమైనా అంతర్గత ద్రోహాన్ని ఎదిరించి ముందుకు సాగినట్లయితే అది గెలిచినట్టే లెక్క. 1905లో రష్యాలో జార్ చక్రవర్తికి వ్యతిరేకంగా కార్మికవర్గం తిరుగుబాటు చేస్తే మద్దతు తెలిపిన రైతులు, సైనికులు 1917లో జరిగిన అక్టోబర్ మహావిప్లవంలో ప్రత్యక్షంగా పాల్గొని చరిత్ర సృష్టించారు. అక్టోబర్ విప్లవాన్ని విజయవంతం చేశారు. ఇప్పుడు కొంతమంది మావోయిస్ట్ పార్టీ అగ్రశ్రేణి నాయకులు సాయుధపోరాటాన్ని విరమించినా, ఇంతవరకు వారు కొనసాగించిన పోరాట స్ఫూర్తితో రేపు రాజ్యాంగబద్ధంగా జరుగబోయే మరో ఉద్యమంలోకి మరిన్ని కొత్త శక్తులు వచ్చిచేరి విప్లవ లక్ష్యాన్ని తప్పక సాధిస్తాయి.
1857 సైనిక తిరుగుబాటు మరియు సాయుధపోరాటం అణచివేయబడిన తరువాత స్వాతంత్య్ర ఆకాంక్ష మాత్రం ఆగలేదు. అది గాంధేయ పద్ధతుల్లో కొనసాగి, కొత్త దిశను సంతరించుకొని స్వాతంత్య్రాన్ని సాధించింది. విప్లవ ఉద్యమం సాధించాలనుకున్న లక్ష్యాలు కూడా ఇప్పుడు అహింసా మార్గంలో తప్పక సాధించగలం. మారుతున్న సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక వర్గ సంబంధాల పరిణామాల నేపథ్యంలో, ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకొని, సమయానుకూలంగా పంథాను మార్చుకొని ముందుకు సాగడమే మార్క్స్ సిద్ధాంతమని మావో పేర్కొన్నాడు. ప్రజాస్వామ్యయుతంగా రేపు రాబోవు మరో మహోద్యమానికి ప్రేరణగా నిలవడమే ఇంతవరకు సాగిన సాయుధ పోరాటం సాధించిన ఘన విజయం.
– (వ్యాసకర్త: రాష్ట్ర శాసనమండలి మాజీ సభ్యులు)
నారదాసు లక్ష్మణ్ రావు