Dipu murder case : ఇటీవల బంగ్లాదేశ్ (Bangladesh) లో నెలకొన్న ఆందోళనల సందర్భంగా ఇస్లామ్ మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో 25 ఏళ్ల దీపూ చంద్రదాస్ (Dipu Chandra Das) అనే హిందూ యువకుడిని ఆందోళనకారులు తీవ్రంగా కొట్టి చంపారు. ఈ హత్యపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో యూనస్ ప్రభుత్వం స్పందించింది. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపింది.
తమ ప్రభుత్వ పాలనలో మూక దాడులకు చోటు లేదని, ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష విధిస్తామని బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిషన్ అల్లర్లపై దర్యాప్తు చేస్తోందని చెప్పారు. ప్రజలంతా సంయమనం పాటించాలని, మూక హింసకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘విద్యార్థుల ఉద్యమం’లో కీలకపాత్ర పోషించిన ఇంక్విలాబ్ మోంచో యువనేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యకు గురికావడంతో.. అందుకు నిరసనగా ఆందోళనలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో నివసిస్తున్న భారతీయులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆ దేశంలోని భారత హైకమిషన్ అక్కడి భారతీయులకు సూచించింది. కాగా బంగ్లాదేశ్ అల్లర్లలో మైనార్టీ వర్గానికి చెందిన దీపూ చంద్రదాస్ హత్యకు గురికావడం బాధాకరమని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పేర్కొన్నారు.