జెనీవా : భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకాకు అత్యవసర వినియోగ జాబితాలో చేర్చే విషయమై ఈ నెల 26న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సాంకేతిక సలహా బృందం సమావేశం కానున్నది. టీకాకు అనుమతులపై సమావేశంలో చర్చించనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు భారత్ బయోటెక్‌తో కలిసి డబ్ల్యూహెచ్ఓ పని చేస్తోందని తెలిపారు. విస్తృతమైన టీకా పోర్ట్‌ఫోలియో ఉండాలన్నది తమ లక్ష్యమని సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. కొవాగ్జిన్ టీకాకు అత్యవసర అనుమతుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థకు భారత్ బయోటెక్ విడుతలవారీగా సమాచారాన్ని అందిస్తున్నది. డబ్ల్యూహెచ్ఓ అభ్యర్థన మేరకు గత నెల 27న అదనపు సమాచారాన్ని పంపగా.. ప్రస్తుతం ఆ డేటాను నిపుణులు సమీక్షిస్తున్నారు. ఈ నెల 26న జరిగే భేటీలో కొవాగ్జిన్ టీకాను అత్యవసర వినియోగ జాబితాలో చేర్చే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.
భారత్ బయోటెక్ కంపెనీ ఐసీఎంఆర్‌తో కలిసి దేశీయంగా కొవాగ్జిన్ టీకాను తయారు చేసింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఇండియా టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈయూఎల్ కోసం కొవాగ్జిన్ టీకాకు సంబంధించిన డేటాను డబ్యూహెచ్ఓకు సమర్పించామని.. ఫీడ్‌బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నట్లు భారత్ బయోటెక్ పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ కోరిన వివరణలకు అందించామని, వీలైనంత త్వరగా ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ పొందేలా ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పని చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
The technical advisory group will meet on Oct 26th to consider EUL for #Covaxin. @WHO has been working closely with @BharatBiotech to complete the dossier. Our goal is to have a broad portfolio of vaccines approved for emergency use & to expand access to populations everywhere https://t.co/lqQIyqItF9
— Soumya Swaminathan (@doctorsoumya) October 17, 2021