నల్లరేగడి నేలల్లో తెల్లబంగారం మెరిసిపోతున్నది. రైతన్న ఇంట సిరులు కురిపిస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉండడంతో జిల్లాల్లో రికార్డు స్థాయి ధర పలుకుతున్నది. సీసీఐ మద్దతు ధర క్వింటాల్‌కు 6,025ను దాటి, ఎవరూ ఊహించని విధంగా 8వేల పైకి ఎగబాకింది. గురువారం జమ్మికుంట మార్కెట్లో ఏకంగా క్వింటాల్‌కు 8,850పైనే ధర రాగా, మిగతా చోట్లా ఇదే హవా నడిచింది. మున్ముందు ఇంకా పెరిగే అవకాశముండగా, రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
ముకరంపుర, డిసెంబర్ 30: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పండే పత్తికి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుంది. ఇక్కడి వాతావరణం, నేల స్వభావం రీత్యా పత్తి పింజ పొడవు 30మి.మీ దాకా ఉంటుంది. గింజ నాణ్యతతో పాటు పత్తి రంగు కూడా బాగుండడంతో మన పత్తికి మంచి ఆదరణ ఉంది. దేశీ య అవసరాలతోపాటు అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువే. వానకాలంలో వాణిజ్య సరళిలో పత్తి అత్యధిక విస్తీర్ణంలో సాగవుతుంది. నల్ల రేగడి భూముల్లో ఎకరానికి 10నుంచి 12క్వింటాళ్ల మధ్య దిగుబడి వస్తుంది. గతంతో పోలిస్తే ఈ సీజన్లో అకాల వర్షాల ప్రభావంతో పూత, కాత దశలో పంటంతా నీటి పాలై దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. రోజుల తరబడి పత్తి క్షేత్రాల్లో వాన నీరు నిలువడంతో ఛీడపీడల ఉధృతి ఎక్కువై దిగుబడి భారీగా తగ్గింది. ప్రస్తుతం ఎకరానికి నాలుగు క్వింటాళ్లకు మించి రావడం లేదు. గతంతో పోలిస్తే మహారాష్ట్ర, గుజరాత్లో కూడా ఇదే పరిస్థితి. మార్కెట్ అవసరాలకనుగుణంగా సరఫరా లేక అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరిగింది. దీంతో సీసీఐ ప్రకటించిన మద్దతు ధర 6025ను దాటి ప్రైవేట్ వ్యా పారులు కొనుగోలు చేస్తున్నారు. క్వింటాలుకు 8వేల నుంచి 9వేలు దాకా చెల్లిస్తున్నారు. కొందరైతే రైతుల ఇండ్ల ముందే కాంటాలు పెట్టి మరీ కొంటున్నారు.
తాజాగా క్వింటాల్‌కు 8,850 ధర
మొదట్లో క్వింటాల్ పత్తికి 6,500కు పైగా ధర పలికింది. తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. నవంబర్ 1న జమ్మికుంటలో పత్తి బిడ్డింగ్ ధర గరిష్ఠంగా 8,600గా నమోదు కాగా, గురువారం ఏకంగా 8,850చెల్లించారు. కరీంనగర్లో మాత్రం వ్యాపారులు గరిష్ఠంగా 8,693 చెల్లించి ఖరీదు చేశారు.
దండిగా కొనుగోళ్లు..
కరీంనగర్ జిల్లాలో 74.994 ఎకరాలు సాగు చేశారు. అయితే గురువారం నాటికి కరీంనగర్ మార్కెట్లో 2,073క్వింటాళ్లు, చొప్పదండిలో 811క్వింటాళ్లు, జమ్మికుంటలో 68,877క్వింటాళ్లు, జిల్లా వ్యాప్తంగా 21జిన్నింగ్ మిల్లుల్లో 85,977క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి తర్వాత రెండో పంటగా పత్తి సాగు చేస్తున్నారు. ఈ యేడాది 63,150 ఎకరాల్లో సాగు చేశారు. 75,900 మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేయగా, ఇప్పటివరకు భారీగానే కొనుగోలు చేశారు.
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌తో పాటు జిల్లాలో 7 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. ఇందులో 5 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు సాగుతున్నాయి. ఇప్పటివరకు 1,13,801 క్వింటాళ్ల పత్తి విక్రయాలు జరిగాయి. దాదాపుగా 90 కోట్ల పైనే పత్తి వ్యాపారం జరినట్లు తెలుస్తోంది. గత వారం రోజుల నుంచి క్వింటాల్ ధర 8500 పైగానే లభిస్తుంది. తాజాగా గురువారం గరిష్ఠ ధర 8835 పలికింది.
పెద్దపల్లి పత్తికి డిమాండ్..
అంతర్జాతీయ మార్కెట్లో క్రయ విక్రయాలపై పత్తి ధరలు ఆధారపడి ఉంటాయి. చైనా, పాకిస్తాన్లో సీడ్, కాండీ రేట్లు పెరగడమూ ఇందుకు కారణమే. అయితే పెద్దపల్లి పత్తి పింజం పొడవుగా ఉండడం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రైతులు నాణ్యమైన, మామూలుగా ఉన్న పత్తిని వేర్వేరుగా మార్కెట్ తీసుకువచ్చి మంచి ధర పొందాలి.
-ప్రవీణ్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి (పెద్దపల్లి)
గింత ధరత్తదని అనుకోలే..
ఈ యేడాది వానకాలం పదెకరాల్లో పత్తి పంట ఏసిన. పూత దశలో పంటకు గులాబీ రంగు చీడ ఆశించింది. దీంతో పురుగు పట్టి పంట దెబ్బతిన్నదని రందితో ఉన్న. కానీ, మార్కెట్ల గింత ధర వత్తదని అనుకోలేదు. క్వింటాల్‌కు రూ.8వేలకు పైనే పలికింది. దీంతో ఉన్న పంటకు మంచి ధర రావడంతో శానా సంతోషంగ ఉంది.
పెరిగిన ధరతోటి కలిసి వచ్చింది
నాకు రెండెకరాల భూమి ఉంది. మరో 26 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగుచేసిన. వర్షాలతోటి దిగుబడి సరిగా రాలేదు. పెట్టుబడి బాగనే అయింది. కానీ, ఇప్పుడు పెరిగిన ధరతో కలిసి వచ్చింది. ఇప్పటి వరకు 113క్వింటాళ్లు అమ్మిన. ఒకసారి రూ.7,625, మరోసారి రూ.8,195ధర వచ్చింది. ఈ రోజైతే రూ.8, 693 ధర అచ్చింది.