హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ‘గోదావరిలో నీటి లభ్యత ఎంత? ట్రిబ్యునల్ కేటాయింపులు మినహాయించగా అందుబాటులో ఉండే అదనపు జలాలు ఎన్ని? వాటిని వినియోగించుకోవచ్చా? దానిపై కేంద్రానికి స్పష్టత ఉందా? ఆ దిశగా అధ్యయనం జరగాలి. ఆ తరువాతనే నదుల అనుసంధానం ప్రాజెక్టుపై ముందుకుపోవాలి’ అని తెలంగాణ సర్కారు కేంద్రానికి మరోసారి నొక్కిచెప్పింది. ఎలాంటి అధ్యయనం లేకుండా ముందుకుపోవద్దని స్పష్టంచేసింది. గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై కేంద్ర జల్‌శక్తిశాఖ శుక్రవారం ఢిల్లీలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి అధికారులు పాల్గొన్నారు.
కచ్చితమైన లెక్కలు తీయాలి
తెలంగాణ అంతర్రాష్ట్ర జలమండలి సీఈ మోహన్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. గోదావరి నదిలో నీటి లభ్యత గణాంకాలను సమగ్రంగా, శాస్త్రీయ పద్ధతిలో సేకరించాలని, ఆ తరువాతే నదుల అనుసంధానంపై దృష్టి సారించాలని స్పష్టంచేశారు. అన్ని రాష్ర్టాల అంగీకారం తీసుకున్న తరువాతనే నదుల అనుసంధానం ప్రాజెక్టుపై ముందుకుపోవాలని సూచించారు. గోదావరి జలాల్లో తెలంగాణకు 968 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని, అదనపు జలాలు అందుబాటులో ఉన్న ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం అందజేసిన డీపీఆర్‌లకు అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తిచేశారు.
మరోసారి రాష్ర్టాలతో సమావేశం
ఏపీ అధికారులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. గోదావరి-నదుల అనుసంధాన ప్రక్రియకు పోలవరం ప్రాజెక్టును ప్రాతిపదికగా తీసుకోవాలని, అక్కడి నుంచే చేపట్టాలని ప్రతిపాదించారు. కరువుప్రాంతాలకు లబ్ధి చేకూరుతుందటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కర్ణాటక పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు ప్రాజెక్టును స్వాగతించాయి. వెంటనే పనులు మొదలు పెట్టాలని కోరడంతోపాటు, తమ భూభాగంలో చేసిన ప్రాజెక్టు అలైన్మెంట్లో కొన్ని మార్పులు చేయాలని, అదేవిధంగా అదనంగా 84టీఎంసీల నీరివ్వాలని తమిళనాడు విజ్ఞప్తిచేసింది. నదుల అనుసంధానానికి అవసరమైన భూసేకరణ, ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? అనే దానిపై సమావేశంలో చర్చించినట్టు ఎన్‌డబ్ల్యూడీఏ అధికారులు తెలిపారు. తదుపరి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో తెలంగాణ అంతర్రాష్ట్ర జలమండలి ఈఈ సుబ్రహ్మణ్యప్రసాద్, కేంద్ర ప్రభుత్వ సలహాదారు శ్రీరామ్ వెదిరె, ఏపీ, కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు, జల్‌శక్తిశాఖ, ఎన్‌డబ్ల్యూడీఏ అధికారులు పాల్గొన్నారు.