హైదరాబాద్, మార్చి 26(నమస్తేతెలంగాణ): ‘బీసీ సబ్ ప్లాన్ ఏది? ఏటా బడ్జెట్లో రూ.20 వేల కోట్ల హామీ ఏమైంది? 42 శాతం బీసీ రిజర్వేషన్ల ఊసేలేదు. కాంట్రాక్టుల్లో వాటా అసలే లేదు. ఇచ్చిన హామీలు తప్పారు.. బలహీన వర్గాలకు తీరని ద్రోహం చేశారు’ అని కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. బీసీలకు ఇచ్చిన హామీలను విస్మరించడాన్ని నిరసిస్తూ హరీశ్‌రావు నేతృత్వంలో గురువారం గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ‘చేపపిల్లలు పంపిణీ చేయాలి.. గొర్రె పిల్లలు ఇవ్వాలి..
బీసీ కార్పొరేషన్లకు నిధులివ్వాలి.. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ సహా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలి’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అన్ని బీసీ కార్పొరేషన్లకు నిధులిచ్చి యువతకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఉచిత చేపలు, రొయ్య పిల్లలు పంపిణీ చేసి మత్స్యకారులు, గంగపుత్రులు, ముదిరాజ్‌లను ఆదుకోవాలని కోరారు. వెంటనే గొల్లకురుమలకు రెండో విడత గొర్రె పిల్లలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం అసెంబ్లీ ఎన్నికల ముందు అలవికానీ హామీలిచ్చిన కాంగ్రెస్.. మూడో బడ్జెట్లోనూ బీసీ వర్గాలకు మొండిచెయ్యి చూపిందని ధ్వజమెత్తారు. బలహీనవర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అసెంబ్లీ లోపల, బయట బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని స్పష్టంచేశారు.