ఇది మాయిముంత దేవులాడుకోవాల్సిన సమయం. తెలంగాణ జెండా కప్పుకొని, తెలంగాణ బిడ్డల ఓట్లతో గెలిచినవాళ్లు తెలంగాణ వ్యతిరేకులతో చేతులు కలిపి తల్లి రొమ్ము గుద్దుతున్న నేపథ్యంలో తెలంగాణ జనం మల్లోసారి కన్నతల్లిని కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. చాటుమాటుగా కాదు, నిర్భీతిగా, పట్టపగలు శాసనసభ్యుని ఇంటికివెళ్లి దాడి చేయటం, ఈ దాడికి స్వయానా పోలీసు యంత్రాంగమే కాపు గాయటం చూస్తుంటే.. ముమ్మాటికీ ఇది అధికారపీఠం అండదండలతోనే జరిగిన దాడి అనిపిస్తున్నది. సంఘ విద్రోహ శక్తులు ఇంట్లోకి చొరబడి శాసనసభ్యుని మీద పడి చేతికి అందిన వస్తువులతో కొడుతుంటే పోలీసులు కొయ్యబొమ్మల తీరున చేష్టలుడిగి నిలబడిపోయారు.
Telangana | అరికెపూడి గాంధీని నామినేట్ చేసింది పబ్లిక్ న్యూసెన్స్ కమిటీ చైర్మన్‌గా కాదు, రాజ్యాంగబద్ధమైన పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా. పద్దుల ఆడిట్ బాధ్యత ప్రతిపక్షాలది. ఈ పదవి ప్రతిపక్షాల హక్కు. ఫిరాయింపుదారుడు ఎప్పటికీ దీనికి అర్హుడు కాదు. అది అరికెపూడికి కూడా తెలుసు.
హైదరాబాద్ నగరం నడిగడ్డలోనే నెంబర్ వన్ బిజినెస్ రాస్తా మీద దాదాపు 25-30 వాహనాల కాన్వాయ్ మూడు పోలీసుస్టేషన్లు దాటి శాసనసభ్యుని ఇంటిమీద పడి దాడికి తెగబడ్డది అంటే.. పోలీస్ ఇంటెలిజెన్స్, ఎస్ఐబీ, స్థానిక పోలీసులు కండ్లు మూసుకున్నారు అనుకోవాల్నా! తెలంగాణ బిడ్డలకు హైదరాబాద్‌లో రక్షణ లేదని చాటిచెప్పటానికి రాజ్యం ఉసిగొల్పిన దాడిగానే పరిగణించాలి.
ఇద్దరు శాసనసభ్యుల మధ్య మూడు రోజులుగా సవాళ్లు- ప్రతిసవాళ్లు నడుస్తున్నయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక శాసనసభ్యుడిని గృహ నిర్బంధంలో ఉంచి, ఇంకో శాసనసభ్యుడిని రోడ్డు మీద వదిలేస్తారా? ఇదేనా పోలీసింగ్ ప్రణాళిక? దాడిని అంచనా వేసి అడ్డుకోలేనంత అసమర్థ స్థితిలో ఉన్నదా మన నగర పోలీసు వ్యవస్థ? ఈ లెక్కన ప్రతిపక్షాలకు చెందినవారి ఇండ్లల్లో అక్రమంగా ప్రవేశించి హత్యలు చేసినా, లూటీలు చేసినా ఫరవాలేదన్న మాట. పోలీసులే దుండగులకు రక్షణ వలయం కూడా కల్పిస్తారా?
పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్ష నేతకు చెందుతుంది. అది రాజ్యాంగధర్మం. దేశంలోనే ఈ సంప్రదాయం ఉన్నది. తెలంగాణలో కొత్త రాజ్యాంగమేదో అమల్లోకి వచ్చినట్టు పార్టీ ఫిరాయించి, పాలకపక్షం పంచన చేరిన అరికెపూడి గాంధిని పీఏసీ చైర్మన్‌గా నియమించటం అనైతికం, రాజ్యాంగ విరుద్ధం. ఇదే తరహాలో గతంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అక్కడి తృణమూల్ కాంగ్రెస్ సీఎం మమతా బెనర్జీ చేశారు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమత విజయం సాధించారు.
అదే ఏడాది నాడియా జిల్లా కృష్ణానగర్ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్‌పై గెలిచిన ముకుల్ రాయ్ అధికార తృణమూల్ కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. మమతా బెనర్జీ ఆయనను పీఏసీ చైర్మన్‌గా నియమించారు. దీన్ని అక్కడి ప్రతిపక్ష పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. సంప్రదాయానికి విరుద్ధంగా పీఏసీ పదవిని ఫిరాయింపుదారునికి ఇచ్చారని ప్రతిపక్ష సభ్యుడు కలకత్తా హైకోర్టులో పిల్ వేశారు. అనంతరం ముకుల్‌రాయ్ అనివార్యంగా రాజీనామా చేయాల్సి వచ్చింది.
అరికెపూడి గాంధీని నామినేట్ చేసింది పబ్లిక్ న్యూసెన్స్ కమిటీ చైర్మన్‌గా కాదు, రాజ్యాంగబద్ధమైన పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా. పద్దుల ఆడిట్ బాధ్యత ప్రతిపక్షాలది. ఈ పదవి ప్రతిపక్షాల హక్కు. ఫిరాయింపుదారుడు ఎప్పటికీ దీనికి అర్హుడు కాదు. అది అరికెపూడికి కూడా తెలుసు. అందుకే నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని, అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని ఓ ప్రకటన చేశారు. ఇది మోసపూరిత ప్రకటన అని తెలంగాణ సమాజానికి తెలుసు. ప్రజలు అమాయకులేం కాదు. ఈ నేపథ్యంలో సాటి శాసనసభ్యునిగా కౌశిక్‌రెడ్డి స్పందించారు.
అరికెపూడి గాంధీ తన ఇంటికి వస్తే బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి, గౌరవంగా భోజనం పెట్టి, అక్కడి నుంచి అటే కేసీఆర్ దగ్గరికి తీసుకువెళ్తానని చెప్పారు. ఆయన వస్తున్నాడని తెలిసి శేరిలింగంపల్లి ఎమ్మెల్యేను నిలవరించకుండా, ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా తన ఇంటికి పంపాలని తన గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీకి ఆదేశాలిచ్చారు. ఇది తప్పు కాదు కదా? అనుచరులతో వెళ్లిన గాంధీ పరుష పదజాలం, రెచ్చగొట్టే మాటలతో కౌశిక్‌రెడ్డి ఇంటి మీద పడ్డాడు. కౌశిక్‌రెడ్డికి దమ్ముంటే బయటకు రావాలని, తాను ఇక్కడే ఉన్నానంటూ గాంధీ సవాల్ విసిరారు.
ఆయన సవాళ్లతో అనుచరులు రెచ్చిపోయారు. చేతికందిన వస్తువులతో దాడి చేశారు. ఈ దాడి హైదరాబాద్ సంస్కృతికి విరుద్ధం. పదేండ్ల తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ప్రాంతీయ పోరాటాలు, అస్తిత్వ పోరాటాలతో రాజ్యం సాధించుకున్న దేశాల్లో జరిగిన తదనంతర పరిణామాలపై కేసీఆర్ విస్తృతంగా అధ్యయనం చేశారు. నివేదికలు, పుస్తకాలు చదివారు. చర్చలు, ఇష్టాగోష్టి పెట్టారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రుల ఆస్తులపై, ఆంధ్రులపై భౌతికదాడులు జరిగే ప్రమాదం ఉన్నదని, వారి ఆస్తులు లూటీ అయ్యే అవకాశం ఉన్నదని ముందే పసిగట్టారు. పోలీసు వ్యవస్థను బలోపేతం చేశారు.
అంతకుముందు ఉన్న పాతకాలపు వాహనాలను తొలగించి, పోలీసులకు అధునాతనమైన ఇన్నోవా వాహనాలను సమకూర్చారు. తర తమ భేదం లేకుండా, హద్దులు మీరిన విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపారు. కేసీఆర్ విశాల హృదయం ముందుచూపుతో హైదరాబాద్‌లో ఆంధ్ర ప్రజలు గుండె మీద చెయ్యి వేసుకుని కంటి నిండా నిద్రపోయారు. కానీ, ఇవాళ హైదరాబాద్ సంస్కృతి మీద దాడి జరిగింది. హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించి, కల్లోలిత తెలంగాణగా ప్రపంచం ముందు నిలబెట్టి, మళ్లీ ఆంధ్రలో కలపాలనే కుట్రకు ఇది తొలి అడుగుగా తెలంగాణవాదులు, పౌర సమాజం భావించాల్సి ఉంటుంది.
వర్ధెల్లి వెంకటేశ్వర్లు