Makar Sankranthi | శ్రీ శుభకృత్ నామ సంవత్సర పుష్య కృష్ణ సప్తమి శనివారం తేది 14-01-2023 చిత్త నక్షత్రం 1వ పాదం సుకర్మ యోగం, బాలవ కరణం, సింహ లగ్నం రాత్రి 8-45 గంటలకు రవి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యోదయం 6-49, సూర్యాస్తమయం 6-01, సంక్రమణ ప్రవేశం రాత్రి 8-45 కాబట్టి, ‘ప్రదోషేవార్థ రాత్రేవ స్నానదాన పరేహణి” అను ప్రామాణిక వచనం అనుసరించి మర్నాడు తేది 15-01-2023 ఆదివారం సంక్రాంతి పండుగ చేసుకోవాలి. ఆదివారం సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు నోములు చేసుకోవచ్చు. ఈ కాలంలో స్నాన-దాన-జప-పితృ దేవతలకు తర్పణాలు చేయడం వల్ల అక్షయ పుణ్యఫలం లభిస్తుంది.
శ్లో|| అష్టకర్ణో విశాలాక్షో లంబ భ్రూర్దీర్ఘ నాశికః
అష్ట బాహుశ్చతుర్వక్త్రః సంక్రాంతి పురుషస్మృతః
శత యోజన మౌన్నత్యం విస్తీర్ణం ద్వాథ స్మృతం
ఏవం రూపం హి విజ్ఞేయం సంక్రాంతి పురుషాకృతేః
మకర సంక్రాంతి పురుష లక్షణం
సంక్రాంతి పురుషుడికి రాక్షస నామధేయం- దుష్టులకు అరిష్టం. శుద్ధోదక స్నాన ఫలం – అనుకూల వర్షాలు, సుభిక్షం. ముద్గాక్షత ధారణ ఫలం- పెసర పంటలకు నష్టం. రక్త (ఎరుపు రంగు) వస్త్రధారణం- యుద్ధభయం, చందన గంధ విలేపనం- ఆరోగ్యం, జాజీ పుష్పాన్ని ధరించడం- కీర్తి, నీలాభరణ భూషణం- క్షేమం, రజత పాత్ర భోజనం- రజత ఉత్పత్తి తగ్గుతుంది, ధర పెరుగుతుంది, పాయస ఆహారం- అనావృష్టి, రంభాఫల భక్షణం- ఆరోగ్యం, బిండివాలాయుధ ధారణం- రాజులకు అరిష్టం, రక్త ఛత్ర ధారణం- యుద్ధభయం, ఖడ్గధారణం- యుద్ధభయం, వ్యాఘ్ర వాహనం- మృగాలకు హాని, క్రోధ ముఖ చేష్ట- అరిష్టం, నివిష్ట చేష్ట- సస్యవృద్ధి, దక్షిణ దిశ- దక్షిణ దిశ ప్రాంతాలకు అరిష్టం, కృష్ణ పక్షం- సువృష్టి, క్షేమారోగ్యాలు, అష్టమి తిథి- స్వల్పవృష్టి, శనివారం- యుద్ధ వాతావరణం, చిత్తా నక్షత్రం- ధాన్యాభివృద్ధి, ప్రదోషకాలం- నిశాచరులకు హాని. సింహ లగ్నం- జంతువులకు అరిష్టం, ముహూర్త ఫలం – శుభప్రదం.