ఎదులాపురం: జీవితం జీవించడానికే ఉందని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని, కష్టాలు ఎదురైనప్పుడే ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలని ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్ (Suicide Prevention Committee Chairman ) డాక్టర్ పరికిపండ్ల అశోక్ ( Ashok ) కోరారు. ఆత్మహత్యల నివారణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం యాపలూడ రెండవ బేటాలియన్లలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
అఘాయిత్యాల ఆలోచనను మానుకొని ఆత్మస్థెర్యంతో ముందుకు సాగిన మనిషి పరిపూర్ణుడవుతాడని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే వ్యక్తుల పట్ల, సమాజం స్వాంతన చేకూర్చి మానసిక ధైర్యాన్ని నింపాలన్నారు. కష్టాల్లో ఉన్న వ్యక్తికి తనకు ఉన్న అన్ని దారులు మూసుకుపోయినప్పుడే ఆత్మహత్య ప్రయత్నం దారి తెరుచుకుంటుందన్నారు. ఆ ప్రమాదకర క్షణంలో మేమున్నామంటూ భరోసానిస్తే బయటపడతారని అన్నారు.
రెండవ బెటాలియన్ కమాండెంట్ నీతికపంత్ మాట్లాడుతూ ఆరోగ్యమిత్ర స్వచ్చంద సంస్థ ఇరవై సంవత్సరాలుగా ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తూ ఇప్పటివరకు 28 మంది జీవితాలను కాపాడటం అభినందనీయమన్నారు. ఇటీవల పోలీస్ శాఖలో ఆత్మహత్యలు పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ఆదేశాల మేరకు ఆత్మహత్యల నివారణ సదస్సులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఆధ్యాత్మిక వేత్త స్వామి, డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్, నిర్మల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ఎండి వహీద్, సభ్యుడు కుర్ర నరేష్ ఆరి, ఆర్ఎస్సై, హెడ్ కానిస్టేబుల్,పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు .అసిస్టెంట్ కమాండెంట్ జయప్రకాశ్ నారాయణ ఆనంతరం ఆత్మహత్యలపై రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు.